
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు మరోమారు సెలవు రానుంది. జూలై 6న శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు జులై 6వ తేదీని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినట్లు గురువారం పశ్చిమ బెంగాల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నోయిడా పాఠశాల సమయాలను మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన సమయం ప్రకారం 1వ తరగతి నుంచి 8 తరగతుల వరకు పాఠశాలలు కేవలం ఉదయం వేళల్లో మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. జిల్లా యంత్రాంగం నుండి కొత్త ఆదేశాలు వచ్చేవరకు అన్ని విద్యాసంస్థలు ఈ సూచనలను పాటించాలని, సవరించిన సమయాన్నే అనుసరించాలని ఆదేశించింది. నోయిడాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. దీంతో విద్యార్ధుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక వేడి వల్ల పిల్లలలో అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అత్యంత ప్రసిద్ధ జాతీయవాద నేతలలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒకరు. న్యాయవాది, విద్యావేత్త, రాజకీయవేత్త, హిందుత్వ కార్యకర్త, రాష్ట్ర, జాతీయ ప్రభుత్వాలలో మంత్రి, కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన తర్వాత కూడా నెహ్రూచే కీలక పదవుల్లో నియమించబడ్డారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినందుకు ప్రసిద్ధి చెందిన ఆయన.. హిందూ మహాసభతో విడిపోయిన తర్వాత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన తన జీవిత కాలంలో దేశ రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని సెలవు దినం ప్రకటించినట్లు ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ముఖర్జీ వారసత్వాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని, అలాగే గ్రంథాలయం, పరిశోధనా సౌకర్యం కోసం రూ. 200 కోట్లు కేటాయిస్తుందని ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా తెలిపారు. ముఖర్జీ హిందూ మహాసభ మాజీ అధ్యక్షుడిగా ఉండి, ఆ తర్వాత భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రాజకీయ, సైద్ధాంతిక కథనంలో ఆయనకు ప్రధాన స్థానం ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పట్టణ, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, సంస్థలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు జూలై 6వ తేదీన మూత పడనున్నాయి.