AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం సూపర్ స్పీచ్ ఇదిగో!

80th Independence Day Speech Telugu: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాల అసెంబ్లీలు, ప్రసంగ పోటీల్లో విద్యార్థులు చెప్పేందుకు ఉపయోగపడే ప్రసంగం ఇది. స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశభక్తి, జాతీయ ఐక్యత, విద్యార్థుల బాధ్యత వంటి అంశాలను ఇందులో సులభంగా వివరించాం.

Independence Day: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం సూపర్ స్పీచ్ ఇదిగో!
Independence Day Speech In Telugu
Rajashekher G
|

Updated on: Aug 14, 2026 | 12:31 PM

Share

Independence Day Speech Telugu: దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పాటు ప్రసంగ పోటీలు, వ్యాసరచన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశభక్తి, జాతీయ ఐక్యత గురించి తమ ప్రసంగాల ద్వారా తెలియజేస్తారు. అయితే ప్రసంగాన్ని ఎలా ప్రారంభించాలి? ఏ అంశాలను ప్రస్తావించాలి? ఎలా ముగించాలి? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. అలాంటి విద్యార్థుల కోసం 2026 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని సులభంగా సిద్ధం చేసుకునేందుకు ఉపయోగపడే పూర్తి ప్రసంగం, ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నా ప్రియమైన స్నేహితులారా.. అందరికీ నా హృదయపూర్వక 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

ఈ రోజు మనందరికీ ఎంతో గర్వకారణమైన రోజు. ఎందుకంటే మన దేశం స్వాతంత్ర్యం పొందిన 80 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఈ జాతీయ పండుగను జరుపుకుంటున్నాం.

1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. అయితే ఈ స్వాతంత్ర్యం మనకు ఒక్కరోజులో లభించలేదు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలు, జైలు జీవితాలు, ప్రాణత్యాగాల ఫలితంగా మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నాం.

బ్రిటిష్ పాలనలో భారతీయులు అనేక అన్యాయాలను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా 1857లో జరిగిన తిరుగుబాటు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. మంగళ్ పాండే, రాణి లక్ష్మీబాయి, బహదూర్ షా జఫర్ వంటి వీరులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు.

ఆ తర్వాత స్వాతంత్ర్య ఉద్యమం మరింత బలపడింది. మహాత్మా గాంధీజీ అహింస, సత్యాగ్రహ మార్గంలో ప్రజలను ఏకం చేశారు. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం.. బ్రిటిష్ పాలనపై ప్రజల తిరుగుబాటును మరింత తీవ్రతరం చేశాయి.

అదే సమయంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి వీరులు తమదైన మార్గాల్లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు దేశ ఐక్యత కోసం విశేష కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్రను కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సరోజినీ నాయుడు, కస్తూర్బా గాంధీ, అరుణా అసఫ్ అలీ, రాణి లక్ష్మీబాయి వంటి మహిళలు ధైర్యం, త్యాగం, నాయకత్వానికి ప్రతీకలుగా నిలిచారు.

స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదు. స్వేచ్ఛను బాధ్యతతో ఉపయోగించడం కూడా నిజమైన స్వాతంత్ర్యానికి అర్థం. మన దేశ రాజ్యాంగాన్ని గౌరవించడం, ఇతరుల హక్కులను కాపాడడం, మతం, భాష, ప్రాంతం వంటి భేదాలను పక్కనపెట్టి ఐక్యంగా జీవించడం ప్రతి భారతీయుడి బాధ్యత.

ముఖ్యంగా విద్యార్థులమైన మనం దేశ భవిష్యత్తు. మనం బాగా చదువుకోవాలి, మంచి విలువలను అలవర్చుకోవాలి, ప్రకృతిని రక్షించాలి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలి. అదే మన స్వాతంత్ర్య సమరయోధులకు మనం అందించే నిజమైన నివాళి.

మన స్వాతంత్ర్య సమరయోధులు కలలు కన్న శక్తివంతమైన, అభివృద్ధి చెందిన, ఐక్యమైన, సంతోషకరమైన భారతదేశాన్ని నిర్మించేందుకు మనమందరం కలిసి కృషి చేద్దాం.

“దేశం మనకు ఏమిచ్చిందని అడగడం కంటే.. దేశానికి మనం ఏమి చేయగలమో ఆలోచిద్దాం.”

జై హింద్! జై భారత్! ధన్యవాదాలు.

Follow Us