తీరుమార్చుకోని NTA.. Re-NEET 2026 ఫలితాల్లోనూ భారీగా అవకతవకలు! 638 మార్కులొస్తే 38కే స్కోర్ కార్డు జారీ
రీ-నీట్ 2026 ఫలితాలపై వివాదం చెలరేగింది. 638 మార్కులు రావాల్సి ఉండగా తన స్కోర్‌కార్డులో కేవలం 38 మార్కులు మాత్రమే చూపించారని ఒక విద్యార్థిని ఆరోపించింది. ఒకటి రెండు మార్కులు తేడా వస్తే సరి.. మరీ ఇంత వ్యత్యాసమా అంటూ సదరు విద్యార్ధిని వాపోతుంది. OMR షీట్‌ను పునఃపరిశీలించాలని NTA, కేంద్ర విద్యాశాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది...

న్యూఢిల్లీ, జూలై 21: రీ-నీట్ (Re-NEET) 2026 ఫలితాలపై మరోసారి వివాదం చెలరేగింది. అధికారిక స్కోర్‌కార్డుల్లో ప్రకటించిన మార్కులు, విద్యార్థులు లెక్కించిన మార్కులకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అలాంటి ఘటనల్లో ఒకటి 19 ఏళ్ల నీట్ అభ్యర్థి ప్రతిభా త్రివేది కేసు. ఆమె లెక్కల ప్రకారం 720లో 638 మార్కులు రావాల్సి ఉండగా, అధికారిక ఫలితాల్లో కేవలం 38 మార్కులు మాత్రమే వచ్చినట్లు వెల్లడించింది.
638 మార్కులు రావాల్సి ఉండగా 38 మార్కులు
జూలై 13న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన తుది ఆన్సర్ కీ ఆధారంగా తన OMR షీట్‌ను పరిశీలించానని ప్రతిభా త్రివేది తెలిపింది. సెట్-80 ప్రశ్నాపత్రం ప్రకారం తనకు 638 మార్కులు వస్తాయని లెక్కించుకున్నానని, అయితే జూలై 16న విడుదలైన ఫలితాల్లో కేవలం 38 మార్కులు మాత్రమే చూపించారని ఆరోపించింది. ఈ ఏడాది తొలిసారి నీట్ పరీక్ష రాసిన ప్రతిభా మొత్తం 180 ప్రశ్నల్లో 162 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని, వాటిలో కేవలం రెండు మాత్రమే తప్పుగా ఉన్నాయని పేర్కొంది. అదనంగా రెండు ప్రశ్నలను NTA తొలగించడంతో వాటికి సంబంధించి గ్రేస్ మార్కులు కూడా రావాల్సి ఉందని వివరించింది.
OMR షీట్ పునఃపరిశీలన కోరిన విద్యార్థిని
ఫలితాల్లో వచ్చిన వ్యత్యాసంపై ప్రతిభా ఇప్పటికే NTAతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తన OMR షీట్‌ను మళ్లీ పరిశీలించి, క్రాస్ వెరిఫికేషన్ నిర్వహించాలని కోరినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది విద్యార్థులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించింది. ప్రశ్నాపత్రం లీక్ వివాదం, రీ-ఎగ్జామ్ నిర్వహణ, ఇప్పుడు ఫలితాల్లో తలెత్తిన ఈ సమస్యల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఫిర్యాదులపై కేంద్ర విద్యాశాఖ దృష్టి సారించినట్లు సమాచారం. అయితే NTA వర్గాల ప్రకారం ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల్లో నిజమైన మార్కుల వ్యత్యాసం ఉన్న కేసు ఏదీ నిర్ధారణ కాలేదని చెబుతున్నారు.
కొంతమంది ఫిర్యాదుదారులు సమర్పించిన OMR షీట్లు కృత్రిమ మేధస్సు (AI) సాయంతో మార్పులు చేసినవిగా కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. జూలై 18న NTA విడుదల చేసిన ప్రకటనలో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనేక OMR షీట్లు నకిలీవని, AI ద్వారా రూపొందించినవని తెలిపింది. పరీక్షా పత్రాలను ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ ఆరోపణలను విద్యార్థులు ఖండిస్తున్నారు. తమ ఫిర్యాదులు ఫలితాలు ప్రకటించిన వెంటనే చేశామని, ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని ప్రతిభా త్రివేది స్పష్టం చేసింది. పారదర్శకంగా, నిర్దిష్ట గడువులోపు OMR షీట్లను పునఃపరిశీలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ రంగు పులుముకున్న వివాదం
రీ-నీట్ ఫలితాల వివాదం మళ్లీ రాజకీయ చర్చకు కూడా దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ NTA తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. నకిలీ లేదా AI రూపొందించిన OMR షీట్లు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యార్థులను హెచ్చరించడం సరైంది కాదని అన్నారు. ‘పిల్లలను బెదిరించకండి. వారు ఎంతో కష్టపడి చదివారు. ఇప్పటికే మొత్తం నీట్ ప్రక్రియను మీరు దెబ్బతీశారు’ అంటూ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రీ-నీట్ ఫలితాల్లోనూ తీవ్రమైన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ పిల్లలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అయితే కేంద్ర విద్యాశాఖ మాత్రం ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు మార్కుల వ్యత్యాసానికి సంబంధించిన ప్రామాణిక ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. మరోవైపు విద్యార్థులు తమ ఫిర్యాదులకు త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
