
జైపూర్, జూన్ 30: రాజస్థాన్‌లోని ఆరోగ్య విశ్వవిద్యాలయం (RUHS) నిర్వహిస్తున్న పారామెడికల్ పరీక్షల నేపథ్యంలో భారీ చీటింగ్ రాకెట్‌ను జైపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఝున్‌ఝునూలోని ఎస్ కరణ్ కాలేజీ పారామెడికల్ విభాగాధిపతి కూడా ఉండటం సంచలనం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టయిన వారిలో ఎస్ కరణ్ కాలేజీ పారామెడికల్ విభాగాధిపతి కృష్ణ కుమార్ సైనీ, అదే కళాశాలలో రేడియాలజీ లెక్చరర్ శంకర్ లాల్ జాట్, ప్రభా మెమోరియల్ పీజీ కాలేజీకి చెందిన రామ్‌కృష్ణ మండీవాల్, ఆ కాలేజీ అడ్మినిస్ట్రేటర్ దేవకృష్ణ మండీవాల్ ఉన్నారు.
సుమారు 40 నుంచి 45 మంది అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి పరీక్షల్లో అక్రమంగా సహాయం చేసేందుకు నిందితులు ప్రణాళిక రూపొందించారు. జైపూర్‌లోని ప్రభా దేవి మెమోరియల్ పీజీ కాలేజీ పరీక్షా కేంద్రంలో పర్యవేక్షకుల సహకారంతో విద్యార్థులకు కాపీయింగ్ చేసే అవకాశం కల్పించాలనే కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. జూన్ 27న ఈ చీటింగ్ ముఠాపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. మొదటి సంవత్సరం పరీక్షల్లో బ్యాక్‌లాగ్ ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని, వారిని పరీక్షల్లో ఉత్తీర్ణులను చేస్తామని హామీ ఇచ్చి డబ్బు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఖోరాబిసాల్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులపై నిఘా పెట్టింది.
పేపర్ అవకతవకలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కృష్ణ కుమార్ సైనీ, శంకర్ లాల్ జాట్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి విద్యార్థుల పేర్లు, వసూలు చేసిన డబ్బు వివరాలు ఉన్న డైరీలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొబైల్ ఫోన్లు, నగదు లావాదేవీల రికార్డులు, అభ్యర్థుల అడ్మిట్ కార్డుల PDF కాపీలు కూడా లభించాయి. అనంతరం దేవకృష్ణ మండీవాల్, రామ్‌కృష్ణ మండీవాల్‌లను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో రాజస్థాన్ పారామెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల అవకతవకలు, పోలీసుల చర్యల నేపథ్యంలో జైపూర్‌లోని ప్రభా దేవి మెమోరియల్ పీజీ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని తక్షణమే రద్దు చేసింది.
🚨Another Day Another Paper Leak – RPMC exam paper leaks
📍Jaipur, Rajasthan
Students burn the midnight oil while paper mafias cash in. Under current govt, merit is up for sale & the future of youth is up for auction ?
Confidence of paper leak mafias is so high under the… https://t.co/SkbnPXTIz6 pic.twitter.com/0hwVwx1FMo
— The Lie Lamaa 🏹 (@The_LieLamaa) June 30, 2026
అంతేకాకుండా ఈ కాలేజీల్లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా భారీ గందరగోళం నెలకొనడంతో ఆ కేంద్రంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేశారు. దీంతో అక్కడ నిర్వహించాల్సిన DCLT, DDT, DECGT కోర్సుల పరీక్షలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు భంగం కలిగించే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరెస్టయిన నలుగురు నిందితులను ఖోరాబిసాల్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజస్థాన్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్ నిర్వహించే వివిధ డిప్లొమా కోర్సులకు సంబంధించిన మొదటి సంవత్సరం ప్రధాన థియరీ పరీక్షలు (సెషన్ 2024-25),బ్యాక్‌లాగ్/సప్లిమెంటరీ పరీక్షల (సెషన్లు 2023-24, 2022-23, 2021-22, 2020-21, 2019-20) కోసం ఈ కేంద్రాన్ని కేటాయించినట్లు సమాచారం.