ఒకేసారి ఇంటర్‌ పాసైన తండ్రీకొడుకులు.. కొడుకు కంటే నాన్నకే ఎక్కువ మార్కులు!

చదువుకు వయసుతో సంబంధం లేదని మరోమారు నిరూపించారు ఓ తండ్రి. కొడుకుతోపాటు ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు రాశాడు. అయితే ఫలితాల్లి కొడుకు కంటే కాస్త మెరుగ్గానే మార్కులు తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్‌కు చెందిన అవతార్‌ సింగ్‌ గురించే మనం చర్చిస్తుంది.

ఒకేసారి ఇంటర్‌ పాసైన తండ్రీకొడుకులు.. కొడుకు కంటే నాన్నకే ఎక్కువ మార్కులు!
Man Clears Class 12 Exam With Son

Updated on: May 20, 2025 | 11:18 AM

చండీగఢ్‌, మే 20: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని పంజాబ్‌కు చెందిన అవతార్‌ సింగ్‌ మరోమారు నిరూపించారు. బర్నాలాలోని రైసర్ గ్రామానికి చెందిన అవతార్ సింగ్ 1982లో మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు తనపై పడటంతో చదువు మానేసి రెక్కలుముక్కలు చేసుకున్నాడు. మరోవైపు అవతార్‌ కుమారుడు కూడా ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా చేరారు. ఇటీవల మళ్లీ చదువుకోవాలని అతడు భావించాడు. అంతేకాకుండా తండ్రిని కూడా చదువుకోమని చెప్పాడు. దీంతో అతడిలో ఇన్నాళ్లకు అవతార్‌లో మళ్లీ చదువుకోవాలన్న ప్రేరణ కలిగింది. అంతేనా.. కొడుకుతోపాటు కష్టపడి చదివడం ప్రారంభించాడు. సామాజిక కార్యకర్తలు భటిండాకు చెందిన సుఖ్విందర్ కౌర్ ఖోసా, బర్నాలాకు చెందిన సుఖ్పాల్ కౌర్ బాత్ ఆయనకు మార్గనిర్దేశం చేశాడు. వారి కృషి ఫలించింది. ఈ ఏడాది అవతార్‌ తన కుమారుడితో కలిసి ఇంటర్ పరీక్షలు రాశాడు.

తాజాగా వెలువడిన పంజాబ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాల్లో అవతార్‌ పాస్‌ అవడమేకాదు.. తన కుమారుడి కంటే ఎక్కువ మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. అవతార్ పరీక్షలో 72 శాతం మార్కులు సాధించగా, అతని కుమారుడు 69 శాతం మార్కులు సాధించాడు. అవతార్ సింగ్ సోదరుడు జగ్రూప్ సింగ్ మాట్లాడుతూ.. తన సోదరుడి విజయానికి గర్వపడుతున్నానని అన్నారు. చదువుకోవడానికి వయోపరిమితి అవసరం లేదని, కెనడాలో నివసిస్తున్న నా మేనకోడలు ద్వారా అవతార్ సాధించిన విజయాల గురించి తనకు తెలిసిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత తాను వివిధ ఉద్యోగాలు చేశానని అవతార్ చెబుతున్నాడు. అప్పట్లో ఉన్నత చదువులపై ఒత్తిడి ఉండేది కాదు. ఉద్యోగం పొందడానికి మెట్రిక్యులేషన్ సరిపోయిందని అయన చెప్పాడు. ఇప్పుడు తాను తన కొడుకుతో కలిసి పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీ బీఏ చదువు పూర్తి చేస్తామని అవతార్ చెబుతున్నాడు. చదువుకు ఎటువంటి అడ్డంకులు లేవని అవతార్ చెప్పాడు. దృఢ సంకల్పంతోపాటు చదువుకోవడానికి సహాయం చేసినందుకు ఖోసా, బాత్‌లకు అవతార్ కృతజ్ఞతలు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.