రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాల వెల్లడికి కసరత్తులు పూర్తి చేశాయి. ఈ నెలఖారు వరకు లేదా సెప్టెంబర్ మొదటివారం నుంచి వరుసగా ఫలితాలు ప్రకటించేందుకు కార్యచరణను రూపొందించాయి. అలాగే మహిళలకు సమాంతర రిజర్వేషన్ల కల్పనపై న్యాయవివాదం వచ్చే వారం నాటికి పరిష్కారమయ్యే అవకాశముందని నియామక సంస్థలు భావిస్తున్నాయి. ఆ తర్వాత వెంటనే రాత పరీక్షల మార్కులు, మెరిట్ జాబితాలు, 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక, తుది ఫలితాలను వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ, గురుకుల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాయి. సంక్షేమ గురుకులాల్లో అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి సీబీఆర్‌టీ పరీక్షల ప్రాథమిక కీ పై ఏవైనా అభ్యంతరాల ఉంటే శనివారం వరకు తెలిపే అవకాశం ఉంటుంది. ఈ నెల చివరి నాటికి తుది కీ తో పాటు అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో ఫలితాల్ని వెల్లడించేందుకు సాంకేతిక ప్రక్రియను సైతం పూర్తి చేశాయి.
టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ), గురుకుల నియామక బోర్డు డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలకు సంబంధించిన ప్రకటన ప్రక్రియను ప్రారంభించనున్నాయి. గ్రూప్-4 ప్రిలిమినరీ కీ ని కమిషన్ ఈ నెల చివరికి ప్రకటించనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు ఇప్పటిదాకా వర్టికల్ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది సరికాదని.. వాళ్లకి సమాంతర రిజర్వేషన్లను అమలు చేయాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు. రాజస్థాన్ పీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గ్రూప్-1 ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని టీఎస్‌పీఎస్సీకి న్యాయస్థానం సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసేటటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై మరింత స్పష్టత కోసం మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఆ వివాదానికి సంబంధించిన అంశాలు వచ్చే వారంనాటికి పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని నియామక సంస్థలు భావిస్తున్నాయి. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించునున్నాయి.
టీఎస్‌పీఎస్సీ ఏఈఈ పోస్టుల ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏఈఈ మెరిట్ జాబితా ప్రకటన తరువాత లైబ్రేరియన్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల చేయనుంది. వ్యవసాయ అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్ ఫలితాలు ప్రకటించాలని అనుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే వ్యవసాయ అధికారుల పోస్టుల సంఖ్య తగ్గుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి స్పష్టత రావాలి. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు పెంచాలన్న డిమాండ్‌తో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సమాంతర రిజర్వేషన్లతో పాటు జీవో నంబర్ 55పై స్పష్టత వస్తేనే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జులై 1న జరిగిన గ్రూప్-4 అభ్యర్థుల పేపర్-1, పేపర్-2 ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్(స్కానింగ్)ను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ పరీక్షను 7.62 లక్షల మంది అభ్యర్థులు రాశారు. ఆగస్టు నెల చివరి నాటికి ప్రిలిమినరీ కీ ని కమిషన్ ప్రకటించబోతుంది. ఆ తర్వాత అభ్యంతరాలు తీసుకొని, 15 రోజుల్లో తుది కీ వెల్లడించే అవకాశాలున్నట్లు సమాచారం.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.