అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గతేడాది డిసెంబర్ 30న 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఈ పోస్టుల సంఖ్యను పెంచుతూ ఏపీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. కొత్తగా మరో 50 పోస్టులను కలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290కి చేరింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 13వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయో పరిమితి 2023 జులై 1 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ కేటగిరీకి చెందినవారికి మూడేళ్లు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.250తో పాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డు కలిగిన మహిళలకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. మిగతా అందరూ రూ.370లు అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్/ మే, 2024లో ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు వేతనంగా చెల్లిస్తారు.
డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్- 1 150 ప్రశ్నలకు 150 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.150 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పేపర్- 2 పరీక్ష అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుపై ఉంటుంది. 150 ప్రశ్నలకు 300 మార్కులకు 150 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్ మార్కు ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.