
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీపికబురు చెప్పింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతిభా సేతు (Pratibha Setu) పోర్టల్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ (Young Professional – YP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. పరీక్షల నిర్వహణతో పాటు అకడమిక్, న్యాయ, ఆర్థిక పరిశోధన కార్యకలాపాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నియామకాలను ఎన్టీయే చేపడుతోంది. ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీలోని NTA ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. విధుల నిర్వహణలో దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా అప్పుడప్పుడు ప్రయాణించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులన్నింటికీ UPSC ప్రతిభా సేతు పోర్టల్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ రీసెర్చ్ పోస్టులకు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై ప్రతిభా సేతు పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పీహెచ్‌డీ లేదా బోధన, పరిశోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. లీగల్ రీసెర్చ్ పోస్టులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో లా (Law)ను ఆప్షనల్ సబ్జెక్టుగా తప్పనిసరిగా తీసుకుని ఉండాలి. అలాగే ఎల్‌ఎల్‌ఎం (LLM) కూడా పూర్తి చేసి ఉండాలి. న్యాయ పరిశోధన లేదా లిటిగేషన్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రీసెర్చ్ పోస్టులకు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై ప్రతిభా సేతు పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి. అలాగే కామర్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ లేదా సంబంధిత విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా చార్టర్డ్ అకౌంటెంట్ (CA), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA), కంపెనీ సెక్రటరీ (CS) వంటి ప్రొఫెషనల్ అర్హతలు కలిగి ఉండాలి. ఫైనాన్స్, బడ్జెటింగ్ లేదా ఆడిటింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. UPSC ప్రతిభా సేతు పథకం ప్రకారం అభ్యర్ధుల వయసు నిర్ణయించిన వయోపరిమితిలో మాత్రమే ఉండాలి.
UPSC ప్రతిభా సేతు NTA ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూకి పిలుస్తారు. అవసరమైతే రాత పరీక్ష లేదా టాస్క్ బేస్డ్ అసెస్‌మెంట్ చూడా చేస్తారు. నోటిఫికేషన్ వెలువడిన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జులై 25, 2026న నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.80,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ప్రారంభంలో 24 నెలల కాంట్రాక్ట్ ఉంటుంది. పనితీరు, సంస్థ అవసరాలను బట్టి మరో 12 నెలలు పొడిగించే అవకాశం. ఏడాదికి 8 రోజుల ప్రోరేటా సెలవులు ఉంటాయి. వారానికి 5 రోజుల పని విధానం. NTA విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మాత్రమే ఉంటాయి. ఈ ఉద్యోగాల ద్వారా కేంద్ర ప్రభుత్వం లేదా NTAలో శాశ్వత ఉద్యోగం లభిస్తుందని భావించరాదు. ఈ అవకాశంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించి, UPSC ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని NTA సూచించింది.