న్యూఢిల్లీ, జులై 21: నీట్ యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకల వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు జులై 20న మధ్యాహ్నం 12 గంటలలోపు సిటీ, సెంటర్ వారీగా నీట్ యూజీ 2024 పరీక్ష మార్కులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ఎన్టీయేని ఆదేశించింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్-యూజీ ఫలితాలను ఎన్‌టీఏ వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఫలితాల కోసం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
మెడికల్ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నీట్ పరీక్షను రద్దుతోపాటు, పునఃపరీక్ష, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌లను జులై 22న సుప్రీం కోర్టు విచారణ పునఃప్రారంభించనుంది. కాగా ఈ ఏడాది విదేశాల్లోని 14 నగరాలతో సహా మొత్తం 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో దాదాపు 23 లక్షల మంది అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షరే మే 5వ తేదీన హాజరయ్యారు. జూన్ 4వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. అనంతరం 1563 మంది అభ్యర్ధులకు గ్రేస్ మార్కులు కలపడంపై వివాదం నెలకొనడంతో.. వారందరికీ జూన్ 23వ తేదీన రీ-ఎగ్జాం నిర్వహించి, జూన్ 30 ఫలితాలు వెల్లడించారు.
అయితే పరీక్ష ప్రారంభానికి గంట ముందు హజారీబాగ్‌లోని పాఠశాలలో ప్రశ్నపత్రాల లీక్ జరిగినట్లు ఆరోపణలు రాగా.. కేంద్రం ఈ ఆరోపణలను ధృవీకరించింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మొత్తం 14 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం ప్రకటించిన ఫలితాల్లో 700కుపైగా దాదాపు 2,321 మంది అభ్యర్ధులు మార్కులు స్కోర్ చేశారు. 650 మార్కులకుపైగా 30,204 మంది స్కోర్ చేశారు. 600కిపైగా వచ్చిన వారు 81,550 మంది ఉన్నారు. తాజా ఫలితాలపై సుప్రీంకోర్టులో సోమవారం జరగనున్న విచారణలో ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.