
హైదరాబాద్, జులై 23: దేశంలోని మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకుగానూ నీట్ పీజీ 2025 పరీక్ష మరో పది రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది. ఇందులో అభ్యర్ధుల పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సిటీ సమాచారం ఉంటుంది. ఎన్‌బీఈఎంఎస్ అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా వీటిని పంపుతుంది. పరీక్షకు సరిగ్గా నాలుగు రోజులు ముందుగా అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. అంటే జులై 31న అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. ఇక ఆగస్టు 3వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో ఒకే షిఫ్టులో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.
నీట్ పీజీ-2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NBEMS అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. పరీక్ష రోజున అభ్యర్థులు అడ్మిట్ కార్డ్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఓ ID కార్డుని తీసుకెళ్లాలి. పరీక్ష తర్వాత తుది ఆన్సర్ కీ రూపొందించి బోర్డు ఫలితాలను ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ, సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇతర సందేహాలకు అభ్యర్థులు హెల్ప్‌లైన్ నంబర్ +91-7996165333 ద్వారా NBEMSని సంప్రదించవచ్చు. పని దినాల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉండి సందేహాలు నివృతి చేస్తారు.
నీట్ పీజీ 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ కౌన్సెలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి సీట్ల కేటాయింపు జాబితా బుధవారం (జులై 23) విడుదల చేయనున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 22న ఈ జాబితా విడుదల చేయాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల జులై 23న విడుదల చేస్తున్నట్లు కన్వినర్ తెలిపారు. ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది దాదాపు 1.20 లక్షల మంది విద్యార్ధులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.