
NEET MDS Counselling 2021: NEET MDS కౌన్సెలింగ్ 2021పై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. దీనికి కారణం సీట్ల రిజర్వేషన్ అని తేలింది. ఆలిండియా కోటాలో EWS-OBC రిజర్వేషన్ల చెల్లుబాటుకు సంబంధించిన అంశంపై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు NEET MDS కౌన్సెలింగ్ ఉండదని స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం NEET MDS 2021 ఆల్ ఇండియా కోటా సీట్లలో.. ఆర్థిక, బలహీన విభాగం (EWS), ఇతర వెనుకబడిన తరగతుల (OBC) రిజర్వేషన్లను అమలు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
అయితే నీట్ ద్వారా జరిగే మెడికల్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కోటాను అమలు చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం, OBC వర్గం 27 శాతం, EWS 10 శాతం సీట్లలో రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందుతాయి. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నోటీసు జారీ చేసి ఈ అకడమిక్ సెషన్ నుంచి అంటే 2021-22 నుంచి కొత్త రిజర్వేషన్ నిబంధనలను అమలు చేసిందని పిటిషనర్, విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. MCC ఈ నోటీసుని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2921 జూలై 29 న మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ తన వెబ్‌సైట్ mcc.nic.in లో ఈ నోటీసును జారీ చేయడం గమనార్హం.