
లోకేశ్ అలియాస్ గౌరవ్ పాటిల్ (24)కి పేపర్ లీక్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం ముందుగానే అందింది. ఈ పేపర్‌ను అతని ప్రియురాలు రుతుజా వాట్సాప్ ద్వారా అతనికి పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మార్చి 22న పరీక్ష జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందే గౌరవ్‌కు ప్రశ్నపత్రం చేరినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పరీక్ష అనంతరం గౌరవ్, రుతుజా మధ్య బ్రేకప్ జరిగింది. రుతుజా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత తనను పట్టించుకోకుండా వెళ్లిపోతుందనే భయంతో గౌరవ్ MPSCకి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. తాను ఓ అభ్యర్థికి స్నేహితుడినని పేర్కొంటూ.. పరీక్ష ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయిందని MPSCకి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పేపర్‌ను ముందుగానే పొందిన రుతుజా.. పరీక్ష రాసి నియామక ప్రక్రియలో ఏడో ర్యాంక్ సాధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై క్రైమ్ బ్రాంచ్ ఆమెకు నోటీసు జారీ చేసింది. రుతుజా తండ్రి అమృత్ పాటిల్ (55) పరీక్షకు ముందు మధ్యవర్తి ప్రవీణ్ పాటిల్ (40)ను సంప్రదించారు. నందుర్‌బార్‌కు చెందిన ప్రవీణ్‌కు MPSCలో పనిచేస్తున్న కొందరు అధికారులతో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు విశ్వేశ్వర్ నకాటే (35), గోపాల్ మరాటే (37), అండర్ సెక్రటరీ అభిజీత్ లెండ్వేలు ప్రశ్నపత్రాన్ని సంపాదించడంలో సహకరించినట్లు క్రైమ్ బ్రాంచ్ ఆరోపించింది. పేపర్ కోసం ప్రవీణ్ పాటిల్ MPSC ఉద్యోగులకు రూ.5 లక్షలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. మరింత డబ్బు తర్వాత చెల్లించాల్సి ఉందని కూడా దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. అనంతరం అమృత్ పాటిల్ ప్రశ్నపత్రాన్ని తన కుమార్తె రుతుజాకు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుతుజా ఆ ప్రశ్నపత్రాన్ని పరీక్షకు రెండు రోజుల ముందు వాట్సాప్‌లో గౌరవ్‌కు పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. గౌరవ్ సోదరుడు కూడా ఆ పరీక్ష రాయాల్సి ఉందని దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ లీక్‌పై గౌరవ్ MPSCకి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ వ్యవహారం మరింత తీవ్రమైంది. ఇదే సమయంలో NCP (SP) ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా జూలై చివర్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. నందుర్‌బార్‌లోని ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొందరు అభ్యర్థులకు పరీక్షకు రెండు రోజుల ముందే చాలా ప్రశ్నలు అందాయని ఆయన ఆరోపించారు. దీంతో MPSC ముంబై పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ చేపట్టింది.
ప్రాథమికంగా గౌరవ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. అయితే దర్యాప్తు తనవైపు కూడా సాగుతోందని గ్రహించిన అతను.. అనంతరం తన ఫిర్యాదును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. పరీక్షా ప్రక్రియపై తనకు గందరగోళం ఏర్పడిందని చెప్పినట్లు వెల్లడించారు. అయితే పోలీసులు దర్యాప్తును కొనసాగించడంతో అసలు విషయం బయటపడింది. ప్రశ్నపత్రం నిజంగానే లీక్ అయిందని, గౌరవ్‌కు కూడా పరీక్షకు ముందే ఆ పేపర్ అందిందని అధికారులు గుర్తించారు.డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షను ఈ ఏడాది మార్చి 22న నిర్వహించారు. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లోని 154 గ్రూప్-బి గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్ష జరిగింది. రాష్ట్రంలోని ఆరు రెవెన్యూ డివిజన్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సుమారు 44,500 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జూన్ 12న ఫలితాలను ప్రకటించారు. మొత్తం 506 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. అనంతరం జూలై 22న 488 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు.
అయితే పేపర్ లీక్ ఆరోపణలపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు పూర్తిచేసి మంగళవారం తన నివేదికను MPSCకి అందించింది. అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. బుధవారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా.. పోలీసు కస్టడీకి అప్పగించింది. క్రైమ్ బ్రాంచ్ నివేదిక ఆధారంగా MPSC డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షను రద్దు చేసింది. ఈ పోస్టుల కోసం కొత్తగా మరో పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రద్దైన నియామక ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులకు మాత్రం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని MPSC స్పష్టం చేసింది. పేపర్ లీక్‌పై సమాచారం ఇచ్చిన వ్యక్తే చివరకు ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ కావడం.. అంతేకాకుండా బ్రేకప్ తర్వాత బయటపడిన వ్యక్తిగత కారణాలు కూడా ఈ వ్యవహారంలో వెలుగులోకి రావడం మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.