TGSRTC: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త.. 2, 3 వారాల్లో ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌: మంత్రి పొన్నం

|

Aug 27, 2024 | 3:29 PM

మరో రెండు, మూడు వారాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు. సంస్థను నష్టాల్లో ముంచిందని..

TGSRTC: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త.. 2, 3 వారాల్లో ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌: మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar on TGSRTC Jobs
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 27: మరో రెండు, మూడు వారాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు. సంస్థను నష్టాల్లో ముంచిందని ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం సరికొత్త విధానాలతో ఆర్టీసీ కార్పొరేషన్‌ను ఒడ్డుకు చేర్చడమే కాకుండా.. లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. భారీగా ఉద్యోగాల భర్తీ, పెద్దసంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు.

ఇక ఇప్పటికే తొలి దశలో 3,035 ఉద్యోగాల భర్తీ చేసేందుకు నిర్ణయించగా.. సీఎం రేవంత్‌ కూడా ఆమోదం తెలిపారన్నారు. ఇందుకు సంబంధించి 2, 3 వారాల్లో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు. మరో మూడు, నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, దీనిపై కూడా త్వరలో ప్రకటన వెలువరిస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు కంటి తుడుపు చర్యగా విలీన ప్రక్రియ చేపట్టింది. దీనిపై కమిటీ నిర్ణయం రావాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వివరించారు. మరోవైపు ఒకే క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాఠశాలల భవనాలను నిర్మిస్తామన్నారు. 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో దానికి రూ.150 కోట్ల చొప్పున వ్యయంతో మొత్తం రూ.4,500 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే భవనాలకు భూముల గుర్తింపు ప్రక్రియ మొదలైందని పేర్కొన్నారు.

కాగా ఆర్టీసీలో త్వరలో భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల్లో.. 2000 డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానిక్‌) పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) పోస్టులు, 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పోస్టులు, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టులు, 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌ పోస్టులు, 11 సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌) పోస్టులు, 7 మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌) పోస్టులు, 7 మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషాలిస్ట్‌) పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.