దేశంలో తొలిసారిగా 2022-23 విద్యాసంవత్సరం నుంచి మెడికల్ విద్యను హిందీ మీడియంలో ప్రవేశ పెట్టేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించనున్నారు. గత ఏడాది నుంచి బీటెక్‌ను ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మెడికల్ కాలేజీతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 14 మెడికల్ కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ విద్యను బోధించేందుకు ముందుకు వచ్చాయి. ఇక ఈ ఏడాది ఆ సంఖ్య 20కి పెరిగింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి మరిన్ని కాలేజీలు ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సును అందించేందుకు ముందు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇంజనీరింగ్ విద్యతోపాటు మెడికల్ విద్యను కూడా హిందీలో అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకువచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజ్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ యూనివర్సిటీ తొలుత ఎంబీబీఎస్ కోర్సును హిందీ మీడియంలో బోధనను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ రెండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధీనంలో నడిచేవి కావడం విశేషం. ఈ కాలేజీల్లో 15 శాతం సీట్లను నేషనల్ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌కు సంబంధించి ఇప్పటికే టెక్స్ట్ బుక్స్‌ను కూడా హిందీలోకి అనువదించారు. వాటిని అక్టోబర్ 16న భోపాల్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ కోర్సులతోపాటు, ప్రతిష్టాత్మకమైన మెడికల్ విద్యను కూడా ప్రాంతీయ భాషల్లో బోధిస్తే విద్యార్ధులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ పరంగా ఆటంకాలు ఎదుర్కోక తప్పదని విద్యా నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా మెడికల్, టెక్నికల్ కోర్సులను అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిష్‌లోనే అభ్యసించడం జరుగుతుంది. భాషాభిమానంతో ఆయా కోర్సులను ప్రాంతీయ భాషలో అభ్యసిస్తే ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. పైగా కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు చేసే చోట తప్పనిసరిగా భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.