KVS Admissions 2025: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడ్మిషన్లు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఎప్పట్నుంచంటే

కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. మిగిలిన తరగతులకు ఆయా కేంద్రీయ విద్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తులు సమర్పించాలి. ముఖ్యమైన తేదీలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

KVS Admissions 2025: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడ్మిషన్లు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఎప్పట్నుంచంటే
KVS admissions 2025-26 Notification

Updated on: Mar 07, 2025 | 3:10 PM

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌) విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. అర్హత ఉన్న వారు ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం చొప్పున సీట్ల రిజర్వేషన్‌ ఉంటుంది. అన్ని కేంద్రీయ విద్యాలయాలకు ఇది వర్తిస్తుంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్ధులకు మార్చి 31 నాటికి వయసు 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతి ప్రవేశానికి 7-9 ఏళ్ల మధ్య, మూడు, నాలుగో తరగతులకు 8-10, 5వ తరగతికి 9-11, ఆరుకు 10-12, 7వ తరగతికి 11-13, 8వ తరగతికి 12-14, 9వ తరగతికి 13-15, 10వ తరగతికి 14-16 ఏళ్ల మధ్య నిర్దేశించిన మేరకు తప్పనిసరిగా వయోపరిమితి ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఒక్కో కేంద్రీయ విద్యాలయలో తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు 40 చొప్పున సీట్లు ఉంటాయి. రెండు సెక్షన్లు ఉండటంతో ప్రతి కేంద్రీయ విద్యాలయలో ఒక్కో తరగతికి 80 మందికి ప్రవేశం అవకాశం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..

ఒకటో తరగతి ప్రవేశాలు ఆన్‌లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారు. రెండు నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే మాత్రం లాటరీ సిస్టం ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం ప్రవేశ పరీక్ష ఉంటుంది. 11వ తరగతిలో ప్రవేశాలకు పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో మిగిలిన సీట్లు ఉంటేనే ప్రవేశాలు ఉంటాయి. ఇక 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను వెల్లడిస్తారు. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇక రెండు ఆపై తరగతులకు మాత్రం ఆఫ్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అంటే ఆయా కేంద్రీయ విద్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్య తేదీలు ఇవే..

  • 1వ తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తేదీలు: మార్చి 1 నుంచి మార్చి 21 వరకు
  • ఒకటో తరగతి తొలి ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి తేదీ: మార్చి 25
  • రెండో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి తేదీ: ఏప్రిల్‌ 4
  • మూడో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి తేదీ: ఏప్రిల్‌ 7, 2025.
  • రెండు, ఆ పైతరగతుల్లో ఖాళీగా ఉండే సీట్ల భర్తీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: జులై 31, 2025.
  • రెండో తరగతికి ఎంపికైన వారి జాబితా వెల్లడి తేదీ: ఏప్రిల్‌ 17, 2025.
  • 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు తుది గడువు: జూన్‌ 30, 2025.

కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల నోటిపికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.