JoSAA Counselling 2026: జోసా కౌన్సెలింగ్‌ ఇంకా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదా? మరో 2 రోజులే ఛాన్స్..

దేశంలోని 23 ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో తొలి విడత రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్‌కు మరో రెండు రోజులే మిగిలి ఉంది..

JoSAA Counselling 2026: జోసా కౌన్సెలింగ్‌ ఇంకా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదా? మరో 2 రోజులే ఛాన్స్..
JoSAA Counselling Registration

Updated on: Jun 09, 2026 | 3:42 PM

హైదరాబాద్‌, జూన్‌ 9: జోసా కౌన్సెలింగ్‌కు జూన్ 11 సాయంత్రం 5 గంటలలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయవల్సి ఉంది. ఆలోపు విద్యార్ధులు తమ కోర్సులు, కళాశాలల ఎంపికలను నమోదు చేయాల్సి ఉంటుంది. జోసా షెడ్యూల్ ప్రకారం జూన్ 13న తొలి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. అనంతరం జూన్ 26 వరకు ఆన్‌లైన్ రిపోర్టింగ్, డాక్యుమెంట్ అప్‌లోడ్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగనుంది. రెండో విడత సీట్ల కేటాయింపు జూన్ 30న, మూడో విడత జులై 6న, నాలుగో విడత జులై 10న నిర్వహించనున్నారు. చివరి విడత సీట్ల కేటాయింపును జులై 16న చేపట్టనుండగా, జులై 21తో మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది.

ఈసారి జోసా కౌన్సెలింగ్‌కు 138 విద్యాసంస్థలు

ఈ ఏడాది జోసా కౌన్సెలింగ్ పరిధిలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) కూడా చేరింది. దీంతో మొత్తం 138 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. వీటిలో 23 ఐఐటీలు, ఐఐఎస్‌సీ, 31 ఎన్‌ఐటీలు, ఐఐఈఎస్‌టీఈ, 26 ట్రిపుల్ ఐటీలు, 56 జీఎఫ్‌టీఐలు ఉన్నాయి. జులై 16 నుంచి 21 వరకు అభ్యర్థులు సీటు ఉపసంహరణ (Withdrawal) అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అనంతరం జులై 22 నుంచి 24 వరకు CSAB ద్వారా Partial Admission Fee (PAF) చెల్లింపులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు CSAB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు జోసా షెడ్యూల్‌ను గమనించి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జోసా కౌన్సెలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్లు ఇవే..

  • జేఈఈ మెయిన్ 2026 ర్యాంక్ కార్డు/స్కోర్ కార్డు
  • జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ర్యాంక్ కార్డు (IIT ప్రవేశాలకు)
  • 10వ తరగతి మార్కుల మెమో లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్
  • ఇంటర్మీడియట్ (12వ తరగతి) మార్కుల మెమో
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  • ఆధార్ కార్డు
  • ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ (అవసరమైతే)
  • రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ఎస్సీ/ ఎస్టీ కుల ధృవీకరణ సర్టిఫికెట్
  • ఓబీసీ-ఎన్‌సీఎల్ సర్టిఫికెట్
  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్
  • పీడబ్ల్యూడీ (దివ్యాంగుల) సర్టిఫికెట్

పేరు, జనన తేదీ, తల్లిదండ్రుల పేర్లు అన్ని ధ్రువపత్రాల్లో ఒకే విధంగా ఉండాలి. ఓబీసీ-ఎన్‌సీఎల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు చెల్లుబాటు అయ్యే తేదీలతో ఉండాలి. అడ్మిషన్ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తమతోపాటు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

Follow Us