JEE Main 2025 Schedule: జేఈఈ మెయిన్ సెషన్ 1 (జనవరి) పరీక్షల షెడ్యూల్ విడుదల.. ప్రారంభమైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షల షెడ్యూల్ ఎన్టీఏ విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఎప్పుడంటే..
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెం2 సెషన్ల (జనవరి, ఏప్రిల్) చొప్పున జేఈఈ మెయిన్స్ నిర్వహించనుంది. ఇందులో మొదటి సెషన్ పరీక్షలు జనవరి 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 28 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా నిర్ణయించారు. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటిస్తుంది. పరీక్షకు 3 రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి.
జేఈఈ మెయిన్ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని, యథావిథంగా ఉంటుందని వెల్లడించింది. జనవరి 22 నుంచి 31వరకు జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు రెండు షిఫ్టుల చొప్పున ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడిస్తారు. జేఈఈ మెయిన్స్‌ను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు మెయిన్ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) షెడ్యూల్‌లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 40 రోజులు ఆలస్యంగా షెడ్యూల్ విడుదలైందని చెప్పవచ్చు. గతేడాది జనవరి 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవగా, ఈసారి 2 రోజులు ముందుకు జరిపారు. జేఈఈ మెయిన్ పేపర్ 1, 2లకు కలిపి గత ఏడాది 12.30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీల్లో 24 వేలకుపైగా, ట్రిపుల్‌ఐటీల్లో 8,500లకుపైగా బీటెక్ సీట్లున్నాయి. వీటిల్లో ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 షెడ్యూల్
- ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 28 నుంచి నవంబరు 22 వరకు కొనసాగుతాయి
- హాల్‌టికెట్లు విడుదల తేదీ: పరీక్షకు 3 రోజుల ముందు
- పరీక్ష తేదీ: జనవరి 22 నుంచి జనవరి 31 వరకు
- ఫలితాల ప్రకటన తేదీ: ఫిబ్రవరి 12
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 షెడ్యూల్
- ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతాయి
- హాల్‌టికెట్లు విడుదల తేదీ: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు
- పరీక్ష తేదీ: ఏప్రిల్ 1 నుంచి 8 వరకు
- ఫలితాల ప్రకటన తేదీ: ఏప్రిల్ 17