JEE Main 1st Rank 2025: జేఈఈ మెయిన్‌ 2025 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఈసారి కటాఫ్‌ ఎంతో చూశారా?

జేఈఈ మెయిన్‌ 2025 ఫలితాల్లో దాదాపు అన్ని కేటగిరీల్లో కటాఫ్‌ పర్సంటైల్‌ గతేడాదితో పోలిస్తే ఈ సారి స్వల్పంగా తగ్గింది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల్లో అర్హుల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల నమోదైంది. ఇక గతేడాదితో పోలిస్తే 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థుల సంఖ్య సైతం దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది కేవలం 24 మందే..

JEE Main 1st Rank 2025: జేఈఈ మెయిన్‌ 2025 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఈసారి కటాఫ్‌ ఎంతో చూశారా?
JEE Main 2025 Toppers

Updated on: Apr 20, 2025 | 10:38 AM

అమరావతి, ఏప్రిల్ 20: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 ఫలితాల్లో దాదాపు అన్ని కేటగిరీల్లో కటాఫ్‌ పర్సంటైల్‌ గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల్లో అర్హుల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల నమోదైంది. ఇక గతేడాదితో పోలిస్తే 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థుల సంఖ్య సైతం దారుణంగా పడిపోయింది. గతేడాది జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు 56 మంది ఉండగా.. ఈ ఏడాది కేవలం 24 మందే 100 పర్సంటైల్‌ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో100 పర్సంటైల్‌ సాధించిన వారిలో హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బణిబ్రత మజీ, గుత్తికొండ సాయి మనోజ్ఞ ఉన్నారు. సాయి మనోజ్ఞ మహిళల కేటగిరీలో టాపర్‌గా నిలిచింది. అజయ్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్‌ విభాగంలోనూ టాపర్‌గా నిలిచాడు. అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు సైతం భారీగా తగ్గిపోయారు. గతేడాది జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 21 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించగా ఈ సారి ఆ సంఖ్య కేవలం నలుగురికే పరిమితమైంది.

జేఈఈ మెయిన్‌ 2025 కోసం జనవరి, ఏప్రిల్‌ రెండు సెషన్లలో 15,39,848 మంది దరఖాస్తు చేసుకోగా 14,75,103 మంది హాజరయ్యారు. తుది ఫలితాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2,50,236 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఓపెన్‌ కేటగిరీలో 93.102 పర్సంటైల్‌గా కటాఫ్‌ను నిర్ణయించారు. గతేడాది ఇది 93.236గా నమోదైంది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో కటాఫ్‌ను 80.383గా నిర్ణయించగా గతేడాది 81.326గా నమోదైంది. ఓబీసీ కేటగిరీలో గతేడాది 79.675 పర్సంటైల్‌ ఉండగా ఈ ఏడాది 79.431గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మాత్రం కటాఫ్‌ పర్సంటైల్‌ స్వల్పంగా పెరిగింది. ఎస్సీ 61.152గా, ఎస్టీకి 47.902గా నిర్ణయించారు.

మరోవైపు జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డ 110 మంది ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిలిపేసింది. వీరంతా ఫోర్జరీ పత్రాలు ఉపయోగించినట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఈ స్కోర్‌కు సమానంగా, అంతకంటే ఎక్కువ మార్కులు పొందినవారు మాత్రమే మే 18వ తేదీన జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 2,50,236 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు ఎన్టీయే ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఏప్రిల్‌ 23 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల ఆధారంగా ఐఐటీల్లోని 17 వేలకుపైగా సీట్లను భర్తీ చేస్తారు. అలాగే జేఈఈ మెయిన్‌ ద్వారా ప్రవేశం కల్పించే ఎన్‌ఐటీల్లో దాదాపు 24 వేలు, ట్రిపుల్‌ ఐటీల్లో 8,500, ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 9 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.