JEE Main 2025: లద్దాఖ్‌లో పేపర్‌ 1.. విశాఖలో పేపర్‌ 2..! పరీక్ష కేంద్రాల కేటాయింపులో NTA సిత్రాలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో సారి తన అసమర్ధతను నిరూపించుకుంది. మరో వారంలో జేఈఈ మెయిన్ 2025 తొలివిడత పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్సులను విడుదల చేసింది. ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్దులు తమ పరీక్ష కేంద్రాలు చెక్ చేసుకోగా.. ఇద్దరికీ లద్దాఖ్‌లో పేపర్‌ 1.. విశాఖలో పేపర్‌ 2.. పరీక్ష కేంద్రాలు కేటాయించడం చూసి కళ్లు తేలేశారు..

JEE Main 2025: లద్దాఖ్‌లో పేపర్‌ 1.. విశాఖలో పేపర్‌ 2..! పరీక్ష కేంద్రాల కేటాయింపులో NTA సిత్రాలు
JEE Main 2025 Exam centres

Updated on: Jan 17, 2025 | 2:59 PM

అమరావతి, జనవరి 17: దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్‌ 2025 తొలి విడత పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు కూడా ఎన్‌టీయే విడుదల చేసింది. పరీక్షకు మూడు రోజుల ముందు నుంచి అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి తీసుకురానుంది. అయితే తాజాగా వచ్చిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల్లో పరీక్ష కేంద్రం వివరాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలా ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్ధులు తమ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను చూసుకుని గుడ్లు తేలేశారు. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఈ ఇద్దరు విద్యార్థులకు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించడంతో వారు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకెళ్తే..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఇంటర్‌ చదువుతున్న కె. తేజచరణ్, పి. సాయిలోకేశ్‌ జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కేంద్రాల వివరాలకు సంబంధించి ఇటీవల ఎన్‌టీఏ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసింది. ఈ క్రమంలో తమ పరీక్ష కేంద్రాల వివరాలను తేజచరణ్, సాయిలోకేశ్‌లు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే అందులో వారు ఐచ్ఛికంగా పెట్టుకున్న కేంద్రాలకు బదులు ఎక్కడెక్కడో పరీక్ష కేంద్రాలు రావడం చూసి ఆశ్చర్యపోయారు. జనవరి 29న జరిగే పేపర్‌-1 (బీటెక్‌)కు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో కేంద్రాన్ని కేటాయించగా.. జనవరి 30న నిర్వహించే (బీ ఆర్క్‌) పేపర్‌ 2కు విశాఖపట్నంలో కేటాయించడం విశేషం. దీంతో విద్యార్థుల కుటుంబసభ్యులు వెంటనే ఎన్‌టీఏను సంప్రదించినప్పటికీ.. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏంచేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఎన్టీయే ఇలా ఇష్టారీతిగా వ్యవహరించడం ఏంటని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు.

కాగా జేఈఈ మెయిన్‌-2025 తొలి విడత పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 28, 31 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. జనవరి 22న మొదలయ్యే బీఈ/బీటెక్‌ పేపర్‌1 పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. మొదటి షిఫ్ట్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండ్‌ షిఫ్ట్‌ 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. జనవరి 31 తేదీన మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు బీఆర్క్‌/ బీ ప్లానింగ్‌ సెకండ్‌ షిఫ్ట్‌లో పేపర్‌ 2ఏ, 2బీ పరీక్షలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.