హైదరాబాద్, డిసెంబర్ 22: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు శనివారం (డిసెంబర్ 21) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇక పరీక్ష కూడా ఇదే నెలలో ప్రారంభం కానుంది. మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మంది మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలు రూ.1600, ఇతరులు రూ.3,200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష మొత్తం 2 పేపర్లకు జరుగుతుంది. మే 18న రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మే 11వ తేదీన విడుదల అవుతాయి. జూన్ 2న ఫలితాలు విడుదల చేస్తారు. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్లు భర్తీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరం మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 5 నిర్వహిస్తారు.