
హైదరాబాద్, జనవరి 23: కేంద్ర తపాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2026 సంవత్సరానికి గానూ మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు ఇండియా పోస్టు ఏర్పాట్లు చేస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అందిన సమాచారం మేరకు జనవరి నెల ఆఖరి తేదీలోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పోస్టులకు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
కాబట్టి పదో తరగతి పాసైన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సంబంధిత జిల్లా, మండలాల్లో ఉద్యోగాలు కేటాయిస్తారు. ఈ నోటిఫికేషన్ కింద బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలకు ఇండియా పోస్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
తెలంగాణలోని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పాత విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కోర్సు పూర్తి చేసుకోవడానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా వై వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. 1986 నుంచి 2013 వరకు విద్యాసంవత్సరాల్లో అడ్మిషన్లు పొందిన బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ విద్యార్ధులు స్పెషల్ రీఅడ్మిషన్ పొందడానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ విద్యార్థి సేవల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు కాల్ సెంటర్ 18005990101 లేదా హెల్ప్ డెస్క్ 040-23680222 నంబర్లను ఫోన్ ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.