అమరావతి, అక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికాల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా సీట్ల కేటాయింపుకు సంబంధించిన జీవో 85 సవరిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అక్టోబరు 1న ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6 విభాగాల్లో కలిపి 15 శీట్లు సీట్లు కేటాయించేవారు. అయితే తాజా జీవోతో అన్ని విభాగాల్లో కలిపి 20 శాతం సీట్లు ఇవ్వనున్నట్లు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. పీజీ మెడికల్ డిప్లొమా చేసి, వైద్యులుగా చేరిన వారికి పీజీ మెడికల్ డిగ్రీ పూర్తిచేసేందుకు వీలుగా 12 నెలల డిప్యుటేషన్ అవకాశం కల్పిస్తారు. ఇక ఇప్పటికే పీజీ డిగ్రీ కలిగిన వారు మరోసారి డిగ్రీ చేసేందుకు అనుమతి ఉండదు. సూపర్ స్పెషాల్టీ కోర్సుల ప్రవేశాలకు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. ఈ మేరకు వైద్య కళాశాలలు ప్రవేశాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏడాదిన్నర క్రితం అర్ధాంతరంగా నిలిచిపోయిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శారీరక సామర్థ్య పరీక్షలు 5 నెలల్లో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. రెండో దశకు సంబంధించిన దేహదారుఢ్య, శారీరక కొలతల (పీఎంటీ, పీఈటీ) పరీక్షలకు మరో వారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు. పీఎంటీ, పీఈటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో తుది రాత పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు. కాగా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నియామక ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో కాలేజీల్లో బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎస్‌యూ పరీక్షల నియంత్రణాధికారి డా శ్రీరంగప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, విద్యార్ధులు ఈ మేరకు పరీక్షలకు సన్నద్ధమవ్వాలని పేర్కొన్నారు.