JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ వచ్చేసింది.. పూర్తి వివరాలు..
ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌తో పాటు ఎగ్జామ్ సిలబస్‌ను పొందుపరిచారు. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. ఇక జేఈఈ మెయిన్‌కు ఈసారి సిలబస్ తగ్గించారు. అయితే అడ్వాన్స్‌డ్‌కు కూడా అదే సిలబస్ ఉంటుందా? లేదా? అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు...
![JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ వచ్చేసింది.. పూర్తి వివరాలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/11/jee-advanced-2024.jpg?w=1280)
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024-25 షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతను వహిస్తున్న ఐఐటీ మద్రాస్ ఈ విషయాలను వెల్లడించింది. ఇందుకోసం జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఈ పరీక్షను నిర్వహించనున్న విషయం తెలిసిందే. అడ్వాన్స్‌డ్ పరీక్షను వచ్చే ఏడాది మే 26వ తేదీన నిర్వహించనున్నారు.
ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌తో పాటు ఎగ్జామ్ సిలబస్‌ను పొందుపరిచారు. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. ఇక జేఈఈ మెయిన్‌కు ఈసారి సిలబస్ తగ్గించారు. అయితే అడ్వాన్స్‌డ్‌కు కూడా అదే సిలబస్ ఉంటుందా? లేదా? అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 12వ తేదీతో ముగియనున్నాయి. రిజల్ట్స్ విడుదల చేసిన తర్వాతి రోజు నుంచే అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 21న మొదలవుతుందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన జేఈఈ మెయిన్ ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన రానున్నాయని స్పష్టమవుతోంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ విషయానికొస్తే.. ఏప్రిల్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హాల్ టికెట్లను అందిస్తారు. ఇక పరీక్ష విషయానికొస్తే.. పేపర్-1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతంది. జూన్ 2వ తేదీన కీని విడుదల చేస్తారు. జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
అనంతరం జూన్ 9వ తేదీన తుది ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్ట్ రిజిస్ట్రేషన్‌ను జూన్ 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చేపట్టనున్నారు. ఇక ప్రవేశాలకు నిర్వహించే జోసా కౌన్సెలింగ్ ప్రకియ జూన్ 10వ తేదీన ప్రారంభమవుతుంది. జూన్ 12వతేదీన ఏఏటీ పరీక్షను నిర్వహిస్తారు. జూన్ 15న ఫలితాలు విడుదల చేస్తారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..