JEE Advanced 2022 scorecard download: జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్-2022 ఫలితాలను ఈ రోజు (సెప్టెంబర్ 11) ఐఐటీ బాంబే విడుదల చేసింది. విద్యార్ధుల రోల్ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ సీట్ల భర్తీకి ఈ ఏడాది ఆగస్టు 28న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దాదాపు 1.56 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022లో ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు ఈ నెల (సెప్టెంబర్) 12 నుంచి జోసా (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్లు కల్పిస్తారు. దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. వీటిల్లో అత్యధికంగా 2,129 మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 కట్-ఆఫ్‌ను క్రాస్ చేసిన విద్యార్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT – 2022) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 11 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది. AAT 2022 పరీక్ష సెప్టెంబర్ 14న జరుగుతుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.