అమరావతి, మే 16: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సహా దేశ వ్యాప్తంగా ఉన్న 7 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) కేంద్రాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఐదేళ్ల బీఎస్-ఎంస్ ఇంటిగ్రేటెడ్ కోర్సు, నాలుగేళ్ల బీఎస్ ఇంజినీరింగ్ సైన్సెస్, ఎకానమిక్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసర్ ఆప్టిట్యూడ్టెస్ట్ (ఐఏటీ) జూన్ 9న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మే 13తో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు జూన్ 1న వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున జేఎన్ టీయూ నిర్వహిస్తోన్న పీజీఈసెట్‌కు రూ. 250 ఆలస్య రుసుంతో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మే 14తో ముగిసిన సంగతి తెలిసిందే. అదే రోజు నుంచి దరఖాస్తుల సవరణ విండో ఓపెన్ అయ్యింది. ఈ రోజుతో (మే 16వ తేదీ) దరఖాస్తుల సవరణ ముగుస్తుంది. పీజీఈసెట్ ప్రవేశ పరీక్ష జూన్ 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్‌లో ప్రకటన వెలువరించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి తెలంగాణ పరిధిలోని పీజీ కాలేజీల్లో ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యాయామ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీసెట్ దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ జాన్సన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పీసెట్ ఆన్‌లైన్ దరఖాస్తును మే 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రూ.500 ఆలస్యం రుసుంతో జూన్ 7 వరకు, రూ.1,000 ఆలస్యం రుసుంతో జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జూన్ 25 నుంచి ఎంపికలు జరుగుతాయని కన్వీనర్ తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.