
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 10, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 3,717 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దివ్యాంగ అభ్యర్ధులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఎస్‌ఎస్‌బీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్ పరీక్షల సన్నద్ధతతోనే రాత పరీక్షకు హాజరుకావచ్చు. ఎందుకంటే సిలబస్ దాదాపు వీటితో సరిపోతుంది. పోటీ అధికంగా ఉండే ఈ పోస్టులను సొంతం చేసుకోవాలంటే రాత పరీక్షలో టైర్ 1, టైర్ 2 స్టేజ్‌లను దాటవల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఇంటెలిజెన్స్ బ్యూరో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
రాత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో టైర్ 1 పరీక్ష ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతాయి. టైర్ 1 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మాత్రమే ఉంటుంది. టైర్ 2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. టైర్ 1లో అర్హత సాధించిన వారిని మాత్రమే టైర్ 2 పరీక్షకు అవకాశం కల్పిస్తారు. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన సిలబస్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఈ పరీక్షలో మొత్తం 5 విభాగాల నుంచి వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున కేటాయిస్తారు. అయితే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున కోత ఉంటుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్.. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ఒక గంట వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. టైర్ 1లో వంద ప్రశ్నలకు సమాధానలు ఒక గంట వ్యవధిలో ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు 36 సెకన్ల సమయమే ఉంటుందన్నమాట. తప్పులు లేకుండా కనీసం 60 ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తిస్తే గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. టైర్ 1లో గట్టెక్కిన వారిని మాత్రమే టైర్ 2 పరీక్షకు అనుమతిస్తారు.
టైర్ 2 పరీక్ష మొత్తం 50 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. అంటే పేపర్, పెన్ విధానంలో ఉంటుందన్నమాట. ఇందులో ఎస్సేకి 20 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌కు 10 మార్కులు. కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషియో పొలిటికల్ ఇష్యూస్‌కు సంబంధించి రెండు వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 10 మార్కుల చొప్పున 20 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష వ్యవధి కూడా ఒక గంట. టైర్ 2 పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది.
టైర్ 1 పరీక్షలో అన్ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యుఎస్ 35 మార్కులు, ఓబీసీ 34 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 33 మార్కులు తప్పనిసరిగా పొందాలి. కనీస మార్కులు పొందినవారి జాబితా నుంచి ఆ విభాగాల వారీ ఉన్న ఖాళీలకు పది రెట్ల సంఖ్యలో అభ్యర్థులను టైర్ 2కి ఎంపిక చేస్తారు. టైర్ 2 పరీక్షలో కనీసం 17 మార్కులు పొందవల్సి ఉంటుంది. టైర్ 2 పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి.. టైర్ 1లో సాధించిన మార్కులను కలుపుతారు. ఈ మార్కుల మెరిట్‌తో విభాగాల వారీ ఖాళీలకు ఐదు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. టైర్ 1, టైర్ 2, ఇంటర్వ్యూల్లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.