GATE 2026 Exam Date: గేట్ ప్రవేశ పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. ఇంతకీ ఎప్పుడంటే?
GATE 2026 exam Dates: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2026 పరీక్ష తేదీలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి..

హైదరాబాద్, అక్టోబర్ 21: దేశవ్యాప్తంగా ఎంటెక్, పీహెచ్‌డీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2026 పరీక్ష తేదీలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ 2026 ప్రవేశ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ గువాహటి వెబ్‌సైట్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. మొత్తం 30 పేపర్లలో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. బీటెక్‌తోపాటు బీఎస్సీ, బీఏ, బీకాం విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. పరీక్షలో సాధించిన స్కోర్‌కు ఫలితం వెలువడినప్పటి నుంచి వరుసగా మూడేళ్లపాటు గేట్ స్కోర్‌కు విలువ ఉంటుంది. ఆ స్కోర్‌తో మూడేళ్లలో ఎంటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. అభ్యర్ధులు గరిష్ఠంగా 2 పేపర్ల వరకు పరీక్ష రాయవచ్చు.
గేట్ 2026 ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందంటే..
గేట్ ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలకు మూడు గంటల పాటు ఉంటుంది. జరుగుతుంది. నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు జవాబుకు 33.33 శాతం మార్కుల కోత విధిస్తారు. ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల ప్రశ్నకు 2/3 చొప్పున మార్కుల కోత ఉంటుంది. గేట్ 2026 పరీక్షలో వచ్చిన స్కోరు పీజీ ప్రవేశానికి మూడు ఏళ్లు, పీఎస్‌యూల్లో నియామకానికి రెండేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణకు కొత్తగా 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా జీఓ జారీ చేశారు. ఈ రెండు కొత్త కాలేజీలు జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఏ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తారన్న విషయంపై ఇక్కడ స్పష్టత రాలేదు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




