Job Opportunities: ఆ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగాలు: కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..

| Edited By: Shaik Madar Saheb

Dec 17, 2024 | 10:12 PM

ఫుడ్ డెలివరీ రంగం భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉద్ఘాటించారు. దేశంలో ప్రస్తుతం 77 లక్షల మంది డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. 2030 నాటికి వీరి సంఖ్య 2.5 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.

Job Opportunities: ఆ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగాలు: కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
Nitin Gadkari
Follow us on

ఫుడ్ డెలివరీ రంగం భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్​ గడ్కరీ ఉద్ఘాటించారు. భవిష్యత్తులో ఈ రంగం ఎంతో కీలకమవుతుందని, పెద్ద ఎత్తున అవకాశాలను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో నిర్వహించిన ‘సస్టైనబిలిటీ అండ్​ ఇన్​క్లూజివిటీ: రోల్​ ఆఫ్​ ది ప్లాట్​ఫాం ఎకానమీ’ సదస్సులో మంగళవారం మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం 77 లక్షల మంది డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. 2030 నాటికి వీరి సంఖ్య 2.5 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.

నిరుద్యోగ సమస్యకు పరిష్కారానికి కీలకం

“ఒక రంగంలో 2.5 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం మన దేశం సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు. ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ ముఖ్య ప్రాధాన్యాల్లో ఒకటి” అని గడ్కరీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫాం జొమాటో చేస్తున్న కృషిని గడ్కరీ అభినందించారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఇది ఎంతో సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.

భద్రత కూడా ముఖ్యమే

అయితే, సమయానుకూలంగా డెలివరీ చేయాలనే తపనతో రోడ్డు ప్రమాదాలు జరగడంపై గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి గంటకు 45 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా 20 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు. ఏటా ద్విచక్రవాహనదారులు 80 వేల మంది మరణిస్తున్నారని, ఇందులో హెల్మెట్​ లేకపోవడం వల్ల 50 వేల మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. వీటిని నివారించాలంటే శిక్షణ ఎంతో అవసరమని, 50,000 మందికి డ్రైవర్లకు రహదారి భద్రతా ట్రైనింగ్​ ఇచ్చిన జొమాటోను కేంద్రమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది జీవితాలను రక్షించడంతో తోడ్పడుతుందని చెప్పారు. రోడ్లను సురక్షితంగా మార్చడంలో ఇలాంటి చర్యలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని సూచించారు.