న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండగ సీజన్‌లో నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో భరీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. పండగల సీజన్ వేళ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ఈ ఏడాది లక్ష ఉద్యోగాల సృష్టించబోతున్నట్లు సెప్టెంబరు 4న ఓ ప్రకటనలో తెలిపింది. ఓవైపు భారత్‌లోని పలు దిగ్గజ కంపెనీలు వరుస లేఆఫ్‌లు టెకీలను రోడ్డున పడేస్తుంటే.. ఫ్లిప్‌కార్డు ఉద్యోగాలు కల్పించేపనిలో పడింది. ఇప్పటికే గూగుల్‌తో సహా టీజీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగాలు తొలగించింది. ఈ నేపథ్యంలో పండగ సీజన్ ముందు ఫ్లిప్‌కార్డు 11 కొత్త పుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. దీంతో వీటి సంఖ్య 83కు చేరుకుంటుంది.
దేశ సామాజిక ఆర్థిక వృద్ధికి చేయూతలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా సప్లయ్ చైన్ విభాగంలో ఒక లక్ష వరకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెషర్లకు కూడా ఇందులో ఉద్యోగాలు కల్పిస్తారట. ఈ పండగల సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహణ కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు స్థానిక కమ్యూనిటీకి ఉపాధి లభిస్తాయని తెలిపింది. సప్లయ్ చైన్ విభాగంలో ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్ హౌస్ అసోసియేటర్లు, లాజిస్టిక్స్ కో-ఆర్డినేటర్లు, కిరాణా పార్ట్‌నర్లు, డెలివరీ డ్రైవర్స్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు కల్పించనున్నారు. మహిళలు, దివ్యాంగులు, ఎల్‌జీబీటీక్యూఏఐ+ కమ్యూనిటీకి చెందిన వారిని కూడా నియమించుకోబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కొత్తగా ఉద్యోగాల్లో తీసుకునే వీరికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వీపీ, సప్లై చైన్ హెడ్ హేమంత్ బద్రీ మాట్లాడుతూ.. కంపెనీ సప్లయ్ చైన్ నెట్‌వర్క్‌ను విస్తరించిందని, కస్టమర్ల డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఫ్లిప్‌కార్డు వినియోగదారులకు అసమానమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని హేమంత్ బద్రీ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, స్వయంచాలక గిడ్డంగులను అమలు చేయడం, డేటా-ఆధారిత నిర్ణయాత్మక వ్యవస్థలను చేర్చడం ద్వారా కంపెనీ తన సరఫరా గొలుసు కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి సాంకేతికతలో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ తనసప్లయ్ చైన్‌ను పటిష్టం చేయడానికి, వర్క్‌ఫోర్స్‌ను పెంచడానికి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం.. ఈ పండుగ సీజన్‌లో కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అమెజాన్, బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి ప్రత్యర్థులు కూడా పండుగ సీజన్‌లో పెద్ద మార్కెట్ పొందేందుకు పోటీ పడుతున్నారు.