
నకిలీ నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విక్రయించి సుమారు రూ.30 వేల వరకు అక్రమంగా సంపాదించిన ఓ న్యాయ విద్యార్థిని ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు అక్షయ్ మాల్వియాగా గుర్తించారు. ఇతడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని లసూడియా ప్రాంతానికి చెందినవాడు. నిందితుడు అక్షయ్ ప్రస్తుతం మొదటి సంవత్సరం న్యాయ విద్య (లా) చదువుతున్నాడు. అతడు పాత ప్రశ్నాపత్రాలు, స్టడీ మెటీరియల్‌ను ఉపయోగించి ChatGPT, ఏఐ సహాయంతో నకిలీ NEET ప్రశ్నాపత్రాలను తయారు చేశాడు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. నీట్ పేపర్ లీకైనట్లు అందులో ప్రచారం చేశాడు. అనంతరం వీటిని సోషల్ మీడియా వేదికగా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాజేష్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. అక్షయ్ మాల్వియా ఒక్కో ప్రశ్నాపత్రాన్ని రూ.50 నుంచి రూ.100 వరకు విక్రయించాడని తెలిపారు. ఈ విధంగా సుమారు 22 నుంచి 25 మందికి నకిలీ ప్రశ్నాపత్రాలను అమ్మి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించినట్లు వెల్లడించారు. 12వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం లా ఫస్ట్ ఇయర్ అభ్యసిస్తున్న అక్షయ్ మాల్వియా ChatGPTను ఉపయోగించి నకిలీ NEET ప్రశ్నాపత్రాలను రూపొందించాడు. వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 22 నుంచి 23 మందికి విక్రయించి ఆర్థిక లాభం పొందాడు. వారి నుంచి యూపీఐ, ఇతర ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా చెల్లింపులు చేసి వాటిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని చర్యల వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొనడంతో పాటు మోసపూరితంగా డబ్బు సంపాదించినందుకు కేసు నమోదు చేశామని డీసీపీ త్రిపాఠి తెలిపారు.
నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 318(4) (మోసం చేసి ఆస్తి లేదా డబ్బు పొందడం)తో పాటు సమాచార సాంకేతిక చట్టం (IT Act)లోని సెక్షన్ 66 (కంప్యూటర్ సంబంధిత మోసపూరిత నేరాలు) కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాంచ్ సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంచిందని, అందిన సమాచారంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అలాగే ఈ నకిలీ ప్రశ్నాపత్రాలకు జూన్ 21న నిర్వహించిన అసలు NEET-UG 2026 పరీక్ష ప్రశ్నాపత్రాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నీట్ పరీక్ష రద్దు వివాదం సమయంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులను అక్షయ్ ప్రచారం చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు.
కాగా దేశవ్యాప్తంగా, విదేశాల్లోని 14 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ-టెస్ట్ విజయవంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. దేశంలోని 5,440 పరీక్షా కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో 20 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షను తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించారు.