
తెలంగాణలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదకానుంది. ఆ వెనువెంటనే వెబ్ ఆప్షన్లు కూడా మొదలుకానున్నాయి. ఈ సమయంలో కాలేజీ ఎంపిక ముఖ్యమా? లేక బ్రాంచీ ఎంపిక ముఖ్యమా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నారు. సరైన అవగాహనతో నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి కాలేజీ, బ్రాంచీ ఎంపికలో మొదట ప్రభావం చూపేది విద్యార్థి సాధించిన ర్యాంకు. అయితే వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. గత ఏడాది కౌన్సెలింగ్ వివరాలు పరిశీలించడం ఉపయోగకరమే అయినప్పటికీ, అదే పరిస్థితి ఈ ఏడాది ఉంటుందని 100% భావించకూడదు. కొత్త కోర్సులు, అదనపు సీట్లు, జాతీయ స్థాయి సంస్థల్లో సీట్ల పెరుగుదల వంటి అంశాల కారణంగా కట్‌ఆఫ్ ర్యాంకుల్లో మార్పులు వస్తుంటాయి. అందువల్ల అవకాశం లేదనుకుని మంచి కాలేజీలను వెబ్ ఆప్షన్లలో వెనక్కి నెట్టకూడదు.
చాలా మంది విద్యార్థులు పేరున్న కాలేజీలో వేరే బ్రాంచీ తీసుకోవాలా? లేక తమకు ఇష్టమైన బ్రాంచీని మరో కాలేజీలో ఎంచుకోవాలా? అనే సందిగ్ధంలో ఉంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నాలుగేళ్ల కాలేజీ జీవితం కంటే ఆ తర్వాత దశాబ్దాల పాటు కొనసాగే కెరీర్ మరింత ముఖ్యమైనది. కాబట్టి మీ ఆసక్తి, ప్రతిభ, భవిష్యత్ లక్ష్యాలకు సరిపోయే బ్రాంచీకి ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. కేవలం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో ఏదైనా బ్రాంచీలో చేరడం సరైన నిర్ణయం కాదు. ఆసక్తి లేని కోర్సులో చేరితే చదువులోనూ, ఉద్యోగ జీవితంలోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మెకానికల్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థి, అందరూ కంప్యూటర్ సైన్స్ ఎంచుకుంటున్నారని అదే తీసుకుంటే తర్వాత ఇబ్బందులు పడవచ్చు. ప్రతి బ్రాంచీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులో నైపుణ్యం సాధించినవారే విజయాన్ని అందుకుంటారు.