మంచి కాలేజీనా? ఇష్టమైన బ్రాంచీనా?.. ఇంజినీరింగ్ సీటు ఎంపికలో ఆ తొందరపాటు వద్దు
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సమయంలో కాలేజీ, బ్రాంచీ ఎంపిక విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయం. కేవలం కాలేజీ పేరు లేదా ఉద్యోగ అవకాశాల ఆధారంగా కాకుండా, వ్యక్తిగత ఆసక్తి, బ్రాంచీపై అవగాహన, ప్లేస్‌మెంట్లు, అక్రిడిటేషన్లు, ఫీజులు, మౌలిక వసతులు వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..

తెలంగాణలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదకానుంది. ఆ వెనువెంటనే వెబ్ ఆప్షన్లు కూడా మొదలుకానున్నాయి. ఈ సమయంలో కాలేజీ ఎంపిక ముఖ్యమా? లేక బ్రాంచీ ఎంపిక ముఖ్యమా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నారు. సరైన అవగాహనతో నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి కాలేజీ, బ్రాంచీ ఎంపికలో మొదట ప్రభావం చూపేది విద్యార్థి సాధించిన ర్యాంకు. అయితే వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. గత ఏడాది కౌన్సెలింగ్ వివరాలు పరిశీలించడం ఉపయోగకరమే అయినప్పటికీ, అదే పరిస్థితి ఈ ఏడాది ఉంటుందని 100% భావించకూడదు. కొత్త కోర్సులు, అదనపు సీట్లు, జాతీయ స్థాయి సంస్థల్లో సీట్ల పెరుగుదల వంటి అంశాల కారణంగా కట్‌ఆఫ్ ర్యాంకుల్లో మార్పులు వస్తుంటాయి. అందువల్ల అవకాశం లేదనుకుని మంచి కాలేజీలను వెబ్ ఆప్షన్లలో వెనక్కి నెట్టకూడదు.
చాలా మంది విద్యార్థులు పేరున్న కాలేజీలో వేరే బ్రాంచీ తీసుకోవాలా? లేక తమకు ఇష్టమైన బ్రాంచీని మరో కాలేజీలో ఎంచుకోవాలా? అనే సందిగ్ధంలో ఉంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నాలుగేళ్ల కాలేజీ జీవితం కంటే ఆ తర్వాత దశాబ్దాల పాటు కొనసాగే కెరీర్ మరింత ముఖ్యమైనది. కాబట్టి మీ ఆసక్తి, ప్రతిభ, భవిష్యత్ లక్ష్యాలకు సరిపోయే బ్రాంచీకి ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. కేవలం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో ఏదైనా బ్రాంచీలో చేరడం సరైన నిర్ణయం కాదు. ఆసక్తి లేని కోర్సులో చేరితే చదువులోనూ, ఉద్యోగ జీవితంలోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మెకానికల్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థి, అందరూ కంప్యూటర్ సైన్స్ ఎంచుకుంటున్నారని అదే తీసుకుంటే తర్వాత ఇబ్బందులు పడవచ్చు. ప్రతి బ్రాంచీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులో నైపుణ్యం సాధించినవారే విజయాన్ని అందుకుంటారు.
ఇంజనీరింగ్ కాలేజీల ఎంపికలో వీటిని గమనిస్తున్నారా?
- కాలేజీ ఎంపికలో న్యాక్ (NAAC) గ్రేడింగ్ కీలక ప్రమాణంగా పరిగణించాలి. NAAC A++, A+, A గ్రేడ్‌లతో ఉన్న సంస్థలు విద్యా ప్రమాణాల పరంగా మెరుగ్గా ఉంటాయి. అలాగే సంబంధిత బ్రాంచీకి ఎన్‌బీఏ (NBA) గుర్తింపు ఉందో లేదో కూడా పరిశీలించాలి. ఇది ఆ కోర్సు నాణ్యతను సూచించే ముఖ్యమైన అంశం.
- ఫ్యాకల్టీ అనుభవం, ల్యాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్స్, హైస్పీడ్ ఇంటర్నెట్, హాస్టల్ వసతి, భద్రత, వైద్య సదుపాయాలు వంటి అంశాలను కూడా పరిశీలించాలి. ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందవచ్చు.
- ప్లేస్‌మెంట్లు కూడా కాలేజీ ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయి. గత మూడేళ్ల ప్లేస్‌మెంట్ రికార్డులు, వచ్చిన కంపెనీలు, సగటు వేతనాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలను పరిశీలించాలి. నైపుణ్యాభివృద్ధి, సాఫ్ట్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థలను ఎంచుకోవడం మంచిది.
- అలాగే ఫీజు నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ అవకాశాలు వంటి ఆర్థిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో తక్కువ ఖర్చుతో చదివే అవకాశం ఉంటే, కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో లక్షల రూపాయల ఖర్చు అవుతుంది.
- ఇంజినీరింగ్ కాలేజీ ఎంపిక అనేది కేవలం ఒక సీటు పొందడం మాత్రమే కాదు. అది భవిష్యత్ కెరీర్‌కు పునాది వేయడం. అందువల్ల ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా, మీ ఆసక్తులు, లక్ష్యాలు, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరం.




