Engineering Seats 2025: ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే

రాష్ట్రంలో మేనేజ్‌మెంట్ కోటా (బి-కేటగిరీ) కింద ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు జూలై 19 నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్నాయి. కళాశాలలు ఆగస్టు 10 లోపు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసి, ఆగస్టు 25లోపు అడ్మిషన్ జాబితాను వెల్లడించాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది..

Engineering Seats 2025: ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే
Engineering Admissions

Updated on: Jul 20, 2025 | 5:09 PM

హైదరాబాద్‌, జులై 20: రాష్ట్రంలో2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంజనీరింగ్‌ బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లను భర్తీ చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జులై 19 నుంచే ప్రారంభమైంది. ఈ సీట్లకు సంబంధించి ప్రవేశాలను ఆగస్టు 10 నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆయా కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ బి.బాలకిష్టారెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. సాధారణంగా కన్వీనర్‌ కోటా కింద 70 శాతం సీట్లను ప్రభుత్వం కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తుంది. మిగిలిన 30 శాతాన్ని బీ కేటగిరీ సీట్లుగా పిలుస్తారు.

నిబంధనల ప్రకారం ఆ సీట్లను కూడా కన్వీనర్‌ కోటా ఫీజుతోనే మెరిట్‌ ఆధారంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలు మాత్రం ఒక్కో సీటును రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు డొనేషన్ల పేరిట తీసుకొని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు 30 శాతంలో సగం సీట్లను ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులకు కేటాయించవచ్చు. ఆ సీట్లకు గరిష్ఠంగా 5 వేల అమెరికన్‌ డాలర్లకు సమానమైన ఫీజు తీసుకునే సదుపాయం ఉంది. కానీ ప్రస్తుతం డిమాండ్‌ లేకపోవడంతో సీఎస్‌ఈ, సంబంధిత బ్రాంచీలకు తప్ప మిగిలినవాటికి ఫీజులు సగానికిపైగా తగ్గిస్తున్నాయి.

కాగా గత ఏడాది జులై 31న బీ కేటగిరీ సీట్ల భర్తీకి విద్యామండలి అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది మాత్రం 12 రోజులు ముందుగా అనుమతి ఇచ్చింది. ప్రవేశాలు ఆలస్యమైతే విద్యార్థులు నష్టపోతారని ప్రొఫెసర్‌ బి.బాలకిష్టారెడ్డి అన్నారు. కన్వీనర్‌ కోటాలో సీటు దక్కిన తర్వాత ఫీజు చెల్లించిన విద్యార్ధులు బీ కేటగిరీలో చేరాలంటే కన్వీనర్‌ కోటాలో చెల్లించిన ఫీజు వెంటనే వాపస్‌ తీసుకోవడంలో జాప్యం నెలకొంటుంది. అందుకే ఈసారి కాస్త ముందుగానే నోటిఫికేషన్‌ జారీకి అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా గతేడాది సుమారు 28 వేల మంది విద్యార్ధులు బీ కేటగిరీలో అడ్మిషన్లు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.