CBSE Board Exams 2025: విద్యార్ధులకు హోలీ స్పెషల్ ఆఫర్‌.. ఆ రోజు పరీక్ష రాయని వారికి మరోఛాన్స్!

దేశ వ్యాప్తంగా టెన్త్, ఇంటర్‌ విద్యార్ధులకు పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే హోలీ పండగ కారణంగా మార్చి 15 జరిగే హిందీ పరీక్షకు హాజరు కాలేకపోతున్న విద్యార్ధులకు మరో అవకాశం ఇస్తున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటించింది. పండగ కారణంగా పలువురు విద్యార్ధులు పరీక్షలకు దూరమయ్యే అవకాశం ఉన్నందున..

CBSE Board Exams 2025: విద్యార్ధులకు హోలీ స్పెషల్ ఆఫర్‌.. ఆ రోజు పరీక్ష రాయని వారికి మరోఛాన్స్!
CBSE Board Exams

Updated on: Mar 14, 2025 | 2:25 PM

న్యూఢిల్లీ, మార్చి 14: హోలీ పండగ కారణంగా మార్చి 15 జరిగే హిందీ పరీక్షకు హాజరు కాలేకపోతున్న విద్యార్ధులకు సీబీఎస్‌ఈ బోర్డు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 14 (శుక్రవారం) హోలీ పండగ అయినప్పటికీ దేశంలో కొన్నిచోట్ల మార్చి 15న కూడా ఈ పండుగ జరుపుకుంటారు. దీంతో పలువురు విద్యార్ధులు పరీక్షలకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సీబీఎస్సీకి సమచారం అందడంతో మార్చి 15న జరగనున్న హిందీ పరీక్ష రాయలేని విద్యార్ధులకు మరోమారు పరీక్ష నిర్వహిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గురువారం ప్రకటించింది. ఈ మేరకు విద్యార్ధులు గమనించగలరని సీబీఎస్‌ఈ పరీక్ష కంట్రోలర్‌ సంయమ్‌ భరద్వాజ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షను షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించినా మార్చి 15న హోలీ కారణంగా పరీక్షలో పాల్గొనలేకపోయిన వారికి మరో తేదీన పరీక్ష రాసే అవకాశం ఇస్తాం అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్థులకు బోర్డు నియమ నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈసారి ఈ విద్యార్థులతో పాటు హోలి పండక్కి పరీక్ష రాయలేని విద్యార్థులకు కూడా పరీక్ష రాసేందుకు అవకాశం బోర్డు నిర్ణయించిందని ఆయన తెలిపారు.

కాగా దేశ వ్యాప్తంగా CBSE 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లోని దాదాపు 8 వేల పాఠశాలల నుంచి దాదాపు 44 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల సమగ్రతను కాపాడటానికి CBSE కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రెగ్యులర్ విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫాంలు ధరించాలని, ప్రైవేట్ అభ్యర్థులు లేత రంగు దుస్తులను ఎంచుకోవాలని పేర్కొంది. అలాగే మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, కెమెరాలు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు, గాగుల్స్, పౌచ్‌లు వంటి వాటికి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదు. ముందస్తు అనుమతి పొందిన మధుమేహ విద్యార్థులు తప్ప ఆహారం, పానీయాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. 10వ తరగతి పరీక్షలు మార్చి 18న,12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.