అమరావతి, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. మార్చి 31న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తొలుత ప్రకటించగా.. సరిగ్గా అదే రోజున రంజాన్ పండగ వచ్చింది. రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వ కేలండర్‌లోనూ ఉంది.
నెలవంక మార్చి 31వ తేదీన కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజున పండగ వస్తే ఏప్రిల్ 1న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. దీంతో నెల వంక ఎప్పుడు కనిపిస్తుందో దానిని బట్టి సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కాగా మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా, జీవశాస్త్రం మరో పేపర్‌గా ఇవ్వనున్నారు. ఒక్కో పేపర్ 50 మార్కుల చొప్పున ఉంటాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేశ్ డిసెంబరు 11న విడుదల చేశారు.
ఇక విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ అదనపు సమయం సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. సైన్స్ పేపర్లకైతే ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.