CBSE Inter Exams: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రకాల పరీక్షల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొకిర్యాల్ నిశాంక్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని చెప్పిన మంత్రి.. విద్యార్థుల భ్రదతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని పునరుద్ఘాటించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహించడం ఛాలెంజ్‌తో కూడుకున్న విషయమే అయినప్పటికీ.. విద్యార్థి జీవితంలో 12వ తరగతి పరీక్షలు ఎంతో కీలకమని మంత్రి అభిప్రాయపడ్డారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రక్షణ శాఖ మంత్రి అధ్యక్షతన ఓ కమిటీనీ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అన్ని రాష్ట్రాలకు చెందిన వారు పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపారని చెప్పారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని కానీ.. విజయవంతంగా పరీక్షలను నిర్వహించామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి ధర్మాసనం విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్ కాపీని ప్రతివాదులకు అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. పరీక్షలను రద్దు చేసేలా సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది మమతాశర్మ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మరి పరీక్షల నిర్వహణ జరుగుతుందా లేదా తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.
Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 2,982 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Rajasthan: రాజస్థాన్ ప్రభుత్వ భారీ ఆలోచన..30 కోట్ల ఔషధ మొక్కల పంపిణీకి ప్రయత్నాలు