Capgemini Hiring: గతేడాది కంటే ఈ ఏడాది భారత్ లో 60వేల మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు.. ఫ్రాన్స్(France)కు చెందిన ప్రముఖ సంస్థ కాప్‌జెమినీ (Capgemini) ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్న సంస్థ ప్రతినిధులు.. సరికొత్త నియామకాలతో తమ సంస్థ విలువ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియామకాల్లో అనుభవం ఉన్న వారితో పాటు ఫ్రెషర్లు కూడా ఉండనున్నారని తెలిపారు. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అశ్విన్ యార్డి మీడియాకు వెల్లడించారు. కాప్‌జెమినీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగం మంది భారతీయులే (Indians) కావడం విశేషం. 5జీ, క్వాంటం వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై సంస్థ దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. భారత్‌తోపాటు కొన్ని దేశాల్లోని 5జీ రంగ సేవలు అందించేందుకు భారతీయ కంపెనీలతో కలసి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎరిక్సన్ భాగస్వామ్యంతో కాప్‌జెమినీ గత ఏడాది భారతదేశంలో 5జీ ల్యాబ్ ప్రారంభించింది అని అశ్విన్ అన్నారు. అదేవిధంగా, కాప్‌జెమినీ క్లౌడ్ & ఏఐ కోసం ఒక అకాడమీని ఏర్పాటు చేసింది.
రానున్నది 5జీ తరం. కనుక ఆ దిశగా ఐటీ, టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ టెక్ సంస్థ ఎరిక్‌సన్‌తో కాప్‌జెమినీ జత కట్టింది. గతేడాది ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో 5జీ ల్యాబ్‌ను ప్రారంభించారు. భారత్‌తోపాటు కొన్ని దేశాల్లోని క్లయింట్లకు 5జీ రంగ సేవలు అందించేందుకు సిద్ధం అవుతోంది. క్వాంటం, 5జీ, మెటావర్స్ టెక్నాలజీల్లో సేవలందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే, ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్.. HDFC బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21,503 మందిని నియమించుకుంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 90 శాతం పెరిగాయి. ఈ నెలాఖరు నాటికి నియామకాల సంఖ్య 26 వేలకు చేరుతుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 12,931 మందిని కొత్తగా నియమించుకుంది.