West Bengal Board of Secondary Education: పదో తరగతి బోర్డు పరీక్షల్లో మోసాలకు పాల్పడకుండా నివారించేందుకు పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వినూత్న చర్య చేపట్టింది. నేటి (మార్చి 7) నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలను తాత్కాలికంగా నిషేధించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ (West Bengal)ప్రభుత్వం ఆదివారం (మార్చి 6) ప్రకటించింది. 10వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్ష రోజుల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. గతంలో (2019, 2020)లో పరీక్షలు ప్రారంభమైన గంటలోపే మాల్దా, ముర్షిదాబాద్‌తో సహా పలు జిల్లాల్లోని కొన్ని పరీక్షా కేంద్రాల నుంచి సోషల్ మీడియాల ద్వారా క్వశ్యన్ పేపర్లు లీక్ (Question paper leak) అయినందున, ఈ ఏడాది ఎటువంటి ఆవాంచిత కార్యకలాపాలు చోటుచేసుకోకుండా నివారించడానికే ఇంటర్ నెట్ సేవలను రద్దు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అధికారి తెలిపారు. ఐతే ఏయే ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలను రద్దు చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు. కాగా మాధ్యమిక పరీక్షలు లేదా 10వ తరగతి పరీక్షలు మార్చి 7, 8, 9, 11, 12, 14, 15, 16 తేదీల్లో జరుగుతాయి. ఈ తేదీల్లో ఫోన్ కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్ సేవలు ఆయా ప్రత్యేక ప్రాంతాల్లో నిషేధంలో ఉంటాయి. పరీక్ష రోజులకు ముందు కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఐతే దీనిపై బోర్డు ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: