
అమరావతి, జనవరి 1: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2పై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్ 1 పోస్టుల నియామక ప్రక్రియకు అవాంతరాలు తొలగినట్లైంది. ఏపీపీఎస్సీ చకచకా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పోస్టుల ప్రాధాన్యాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి మరోసారి ఐచ్ఛికాలను స్వీకరించాలని కమిషన్ భావించింది. ఈ మేరకు తాజాగా నిర్వహించిన కమిషన్ సమావేశంలో వివిధ నోటిఫికేషన్లపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్రూప్ 2లో పోస్టుల ప్రాధాన్యంకి సంబంధించి ఐచ్ఛికాల స్వీకరణకు మరోసారి వారం రోజులు గడువు ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం ఎంపిక జాబితాను విడుదల చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
కాగా 2023 డిసెంబరు 905 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 2025 ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్‌లోనే ఫలితాలు కూడా వెల్లడించింది. 1:2 విధానంలో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యింది. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టుల ప్రాధాన్యాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల నుంచి మూడుసార్లు ఐచ్ఛికాలు తీసుకుంది. అయితే హైకోర్టులో దాఖలైన కేసుల నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియ ఆలస్యమైంది. ఈ మధ్యలో దాదాపు 20 ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయి. గ్రూప్ 2 మెరిట్‌లో ఉన్న అభ్యర్థుల్లో కొందరు ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. అందువల్ల మరోసారి ఐచ్ఛికాలు తీసుకోవాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
అయితే గ్రూప్ 2కి సంబంధించి ఇప్పటి వరకు అన్ని కేసులను కోర్టు కొట్టేసింది. కానీ క్రీడాకోటాలో మాత్రం రెండు పోస్టులను రిజర్వు విషయంలో మరో కేసు హైకోర్టులో ఉంది. ఇందులో ఏ కేడర్‌లో పోస్టులను రిజర్వు చేయాలనేదానిపై గతంలో కోర్టు స్పష్టత చేయలేదు. ఇది డీఎస్సీతో ముడిపడి ఉండడంతో గ్రూప్ 2 కేసును ప్రత్యేకంగా చేపట్టాలని హైకోర్టును ఏపీపీఎస్సీ భావిస్తుంది. ఈ కేసుపై స్పష్టత వస్తేగానీ స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీ కొలిక్కిరాదు. మరోవైపు గ్రూప్ 2 తీర్పు అనుగుణంగా గ్రూప్ 1 పోస్టులను కూడా భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తుంది. ఈ మేరకు హైకోర్టును కోరాలని నిర్ణయించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.