అమరావతి, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 ప్రాథమిక పరీక్షకు సంబంధించిన ఫలితాలు వారం రోజుల్లో వెలువడనున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. మెయిన్ పరీక్షకు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. పరీక్షకు మాత్రం 87.17 శాతం మంది హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68 నుంచి 70 శాతం అభ్యర్ధులు హాజరయ్యేవారు. అయితే ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈ ఏడాది నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు అత్యధికంగా హాజరు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 897 పోస్టుల భర్తీకి ఎపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష తీరును పర్యవేక్షించిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాష్ట్రంలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని అయన గతంలో వెల్లడించారు. ప్రిలిమ్స్ ఫలితాల తర్వాత రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఎన్నికల అనంతరం మెయిన్స్ నిర్వహించే అవకాశం ఉంది.
ఇక ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష విషయానికొస్తే మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ విడుదల చేస్తారు. ఆపై గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.