అమరావతి, అక్టోబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 3,220 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం (అక్టోబరు 20) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీలు ఉండగా వాటిల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,629, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 654, ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టులు 415, బ్యాక్‌లాగ్ పోస్టులు 278, బోధనేతర పోస్టులు 24, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో 220 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ ఈ రోజు విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. శనివారం (అక్టోబరు 21) నుంచి దరఖాస్తుల కూడా ప్రారంభం అవుతుంది. రేపట్నుంచి మూడు వారాల పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
ఉమ్మడి పోర్టల్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మాత్రం అన్ని పోస్టులకు కలిపి ఒకే దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. తొలుత ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తుంది. దరఖాస్తు స్వీకరణ నుంచి ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష వరకు మొత్తం 45 రోజుల సమయం ఉంటుంది. ఈ పరీక్షలో అర్హులైనవారి వారిని 1 : 12 చొప్పున ఎంపిక చేసి అకడమిక్ మెరిట్ ఆధారంగా 1 : 4 చొప్పున మౌఖిక ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇప్పటికే యూవర్సిటీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నవారికి ఇంటర్వ్యూ సమయంలో అనుభవానికి గానూ ఏడాదికి ఒక పాయింటు చొప్పున గరిష్ఠంగా 10 పాయింట్లు కేటాయిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 ఆచార్యుల పోస్టుల భర్తీకి ఈ రోజు ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య కె హేమచంద్రారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్‌పై తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తన ప్రకటనలో వెల్లడించారు. ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడహాక్ ఆచార్యులకు పది శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని ఆయన తెలిపారు. ఇక బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి కూడా బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న రేషనలైజేషన్ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుందా అని ఎదురు చూస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.