అమరావతి, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్ జులై-2024) ఫలితాలు సోమవారం (నవంబర్ 4) విడుదలైన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈసారి టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గింది. అందుకు కారణం ప్రతి సబ్జెక్ట్ పేపర్ కఠినంగా ఉండటమేనని తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టెట్ పరీక్షతో పోల్చితే తాజా టెట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు మరింత కఠినంగా వచ్చాయి. దీంతో పాస్ పర్సెంటైల్ గణనీయంగా తగ్గింది. మొత్తం 3,68,661 మంది అంటే 86.28 శాతం మంది టెట్ పరీక్షలు రాస్తే.. వారిలో కేవలం 1,87,256 మంది మాత్రమే అర్హత సాధించారు. అదీ అత్తెసురు మార్కులతో మాత్రమే ఉత్తీర్ణత పొందారు. దీంతో పాస్ పర్సెంటైల్ 50.79 శాతంగా నమోదైంది.
మొత్తంగా అన్ని పేపర్లలో చూస్తే పేపర్ 2 (A) స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్స్ పేపర్‌లో అధికంగా 87.09 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. ఆ తర్వాత పేపర్ 1 (A) ఎస్జీటీ తెలుగు అండ్ మైనర్ మీడియా పేపర్‌లో అధికంగా 65.48 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. మిగిలిన అన్ని పేపర్లలో పాస్ సర్సెంటైల్ 40 శాతానికి మించకపోవడం గమనార్హం. టెట్ పరీక్ష ఇంత కఠినంగా ఉంటే రాబోయే డీఎస్సీ పరీక్ష ఇంకెంత కఠినంగా ఉంటుందోనని అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ వరకు మొత్తం 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షకు దాదాపు 4,27,300 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇక మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులతో నవంబర్ 6న అంటే బుధవారం ప్రకటన విడుదల కానుంది.