
అమరావతి, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి రెండు పరీక్షలు పూర్తయ్యాయి. మార్చి 21 (శనివారం) ఇంగ్లిష్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. గతంలో ఇచ్చిన సెలవుల జాబితా మేరకు మార్చి 20వ తేదీన రంజాన్ పండగ రావల్సి ఉంది. అయితే అనూహ్యంగా రంజాన్ పండగ తేదీ మారింది. దీంతో ఈ పండగ తేదీ మార్చి 21కి మారింది. ఈ క్రమంలో మార్చి 21న నిర్వహించాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తన ప్రకటనలో విద్యాశాఖ వెల్లడించింది. మిగిలిన పరీక్షలు టైమ్ టేబుల్ ప్రకారం యథావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. మార్చి 21న రంజాన్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం (మార్చి 19) అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. నెల వంక దర్శనం ఆధారంగా రంజాన్ పండగ వస్తున్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో నుంచి లేఖ రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మార్చి 21వ తేదీన సెలవు ప్రకటిస్తూ సీఎస్ జి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రంజాన్ సెలవు నేపథ్యంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
అలాగే మార్చి 21న జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ పరీక్షను మార్చి 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మిగిలిన పరీక్షలు ఆయా షెడ్యూల్ ప్రకారం యథాతథంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు తాజా మార్పును గమనించాలని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.