
అమరావతి, ఏప్రిల్ 28: రాష్ట్ర ఇంటర్ విద్యార్ధులు ఇంటర్ బోర్డు కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని పొడిగించినట్టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి రంజిత్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 27 చివరి తేదీ. ఈ గడువు నిన్నటితో ముగిసింది. తాజాగా ఈ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఇది చివరి అవకాశమని సబ్జెక్టులు తప్పిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 30 తర్వాత గడువు తేదీ ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేశారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా నిర్ణీత గడువులోగా విద్యార్ధులు తాము చదువుతున్న కాలేజీల్లో ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు.
కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులతోపాటు సెకండ్ ఇయర్ విద్యార్ధులు కూడా ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు తాజాగా ప్రభుత్వం అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే. కాబట్టి విద్యార్ధులు తమ స్కోర్‌ను పెంచుకోవాలని భావించే ఏప్రిల్ 30వ తేదీలోగా ఫీజు చెల్లించి.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4, 2026వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.