ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్) 2024 పరీక్ష మే 6, 7 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు ఐసెట్ ఛైర్మన్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వీసీ హుస్సేన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 29,938 మంది అమ్మాయిలు, 18,890 మంది అబ్బాయిలు ఉన్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అలాగే తెలంగాణలో మరో రెండు పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఐసెట్ ఛైర్మన్ హుస్సేన్‌రెడ్డి తెలిపారు.
ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఐసెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు పత్రాన్ని తమ వెంట తెచ్చుకోవాలని ఆయన విద్యార్ధులకు సూచించారు. మే 6వ తేదీన నిర్వహించనున్న ఐసెట్ పరీక్షను పకడ్బందీగా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ 2024 ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. మే 6, 7 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తారు. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
పరీక్ష అనంతరం ప్రైమరీ ఆన్సర్ కీ మే 8వ తేదీన ప్రకటిస్తారు. ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ ఆన్సర్ కీతోపాటు ఫలితాలు జూన్ 20వ తేదీన విడుదలవుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.