అమరావతి, నవంబర్ 26: యేటా విద్యార్థులకు చెల్లిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. గతంలో విద్యార్ధుల తల్లి ఖాతాకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు చేసేవారని, ఇకపై కాలేజీల యాజమాన్యాల ఖాతాలకే నేరుగా జమ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై శాసనమండలి సభ్యుల ప్రశ్నలకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తల్లుల ఖాతాలో నగదు జమచేసే విధానం తీసుకొచ్చినా.. ఫీజులు చెల్లించకుండా ఎగ్గొట్టిందని ఆయన ఆరోపించారు.
తొలుత తల్లి ఖాతాలో, ఆ తర్వాత తల్లి-విద్యార్థిలకు కలిపి జాయింట్ ఖాతాలో నగదు జమ చేయడం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందని చెప్పారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికనున్నామని, గతంలో మాదిరిగానే ఈ ఏడాది నుంచి విడతల వారీగా విద్యార్థుల ఫీజుల బకాయిలు నేరుగా కాలేజీల యాజమన్యం ఖాతాలకు మళ్లిస్తామని అన్నారు. మరోవైపు పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంపై ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అయితే గత ప్రభుత్వం మాత్రం మెస్ ఛార్జీలు, ట్యూషన్ ఫీజులను సగం కూడా చెల్లించలేదని, వారి చర్యల వల్ల విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇకపై ఈ విధానాలన్నింటికీ స్వస్తి పలికి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు.
దివ్యాంగుల రిజర్వేషన్ విధానానికి సంబంధించి కేంద్రప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కనీసం 40 శాతం అంగవైకల్యం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు.. ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా వీటిని రూపొందించింది. ఖాళీలను బట్టి వారికి పోస్టులను గుర్తించడం, రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఈ ప్రక్రియను మదింపు చేయడానికి కమిటీలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. అలాగే ప్రత్యక్ష నియామకాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్‌ను తప్పనిసరిగా అమలు చేయడాన్ని తీసుకువచ్చింది. బ్యాక్‌ల్యాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని.. ఏదైనా పోస్టు దివ్యాంగులకు సరిపోతుందని భావిస్తే.. వెంటనే ఆ పోస్టులో ఉన్న వ్యక్తి పదోన్నతి కల్పించాలని, తద్వారా అన్ని పోస్టులనూ రిజర్వ్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా దివ్యాంగుల హక్కుల చట్టం-2006 క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదని ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆక్షేపనలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.