అమరావతి, సెప్టెంబర్ 29: రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సారానికి సంబందించి నిర్వహించనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదట్లో ఈ పేపర్లను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో వచ్చే సంవత్సరం నుంచి ఈ రెండు పేపర్లను తొలగించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/ పార్శి పేపర్లకు అమలు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఏడు పేపర్ల విధానం..
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 7 పేపర్లకు జరగనుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు కలిపి ఒకే పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం మరో పేపర్‌గా 50 మార్కులకు ఉంటుంది. ఈ రెండు పరీక్షలను ఒకటే రోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. రెండు పేపర్లకు కలిపి 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. మిగతా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. తెలుగు, హిందీలో ఎక్కువ మంది విద్యార్ధులు ఫెయిల్ అవుతున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేశారు.
ఇప్పటి వరకు తెలుగు ప్రశ్నపత్రంలో ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించి, దాని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. ఇలా పద్యంపై మొత్తం నాలుగు ప్రశ్నలు వస్తాయి. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులకు ఉంటుంది. ఇక రెండో రెండో ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం ఇచ్చి, దాని భావాం రాస్తే 8 మార్కులు ఇచ్చేవారు. దాని స్థానంలో గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాసేలా పరీక్ష విధానం మార్చారు. ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మార్కులు కేటాయిస్తారు. అలాగే హిందీలో విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రాన్ని మార్చారు. గతంలో తొలగించిన బిట్ పేపర్‌ను మళ్లీ తీసుకొచ్చారు. బిట్ పేపర్‌లో ఒక మార్కు ప్రశ్నలు 14, రెండు మార్కుల ప్రశ్నలు 19 ఉంటాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.