అమరావతి, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఈ నెల 3 నుంచి 6 వరకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ) – 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అన్ని పాఠశాలల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం ఈ మేరకు పరీక్షలు నిర్వహించాలని తన ప్రకటనలో తెలిపింది. పాత పద్ధతిలోనే ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజున మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపించనున్నట్లు తెల్పింది.
పరీక్ష జరిగేరోజున గంట ముందు ఆయా పాఠశాలల్లోని హెచ్‌ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం రోజుకు రెండు పరీక్షలు జరుగుతాయి. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం మాత్రమే పరీక్షలు ఉంటాయి. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక చొప్పున పరీక్షలు జరుగుతాయి.
పరీక్ష నిర్వహణ అనంతరం అక్టోబర్ 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి, విద్యార్ధులకు ఫలితాలు అందించాలని విద్యాశాక ఆదేశించింది. అనంతరం ఆన్‌లైన్ పోర్టల్‌లో సైతం మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. అక్టోబర్ 10వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రోగ్రెస్ గురించి తెలియజేయాలని సూచించింది. పరీక్షల అనంతరం అక్టోబర్ 14 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ ఈ సందర్భంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు సంబంధించి పోస్టల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి రెండో మెరిట్ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 1058 పోస్టులు, తెలంగాణలో 961 చొప్పున బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీలోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని తపాలా శాఖ సూచించింది. పదో తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేపతారనే విషయం తెలిసిందే. మార్కుల ప్రాధాన్యం, రిజర్వేషన్ ప్రకారంగా కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధుల వివరాలను పంపుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.