Nursing Admissions 2026: సర్కార్ షాకింగ్‌ నిర్ణయం.. ఇకపై నీట్‌ ర్యాంకుతోనే నర్సింగ్‌ ప్రవేశాలు!

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) యూజీ పరీక్ష ఆధారంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో 2026-27 విద్యా సంవత్సరం..

Nursing Admissions 2026: సర్కార్ షాకింగ్‌ నిర్ణయం.. ఇకపై నీట్‌ ర్యాంకుతోనే నర్సింగ్‌ ప్రవేశాలు!
NEET UG mandatory for BSc Nursing admissions

Updated on: Feb 19, 2026 | 4:51 PM

అమరావతి, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) యూజీ పరీక్ష ఆధారంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని కాలేజీల్లో నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు తప్పనిసరిగా నీట్‌ యూజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులు, ఏపీఎన్‌సెట్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు చేపట్టారు. తొలిసారిగా నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ నర్సింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఎన్‌సెట్‌) పరీక్ష 2025-26 విద్యా సంవత్సరం నుంచి చేపట్టారు. అయితే ఈ ప్రయోగానికి అశించిన స్థాయిలో ఫలితం రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్ధులకు కేవలం విజయవాడలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఫలితంగా గతేడాది రాష్ట్రంలో మొత్తం 16 వేల సీట్లలో దాదాపు 4 వేల నర్సింగ్‌ సీట్లు మిగిలిపోయాయి. దీంతో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తాజాగా ఉన్నతాధికారులతో నర్సింగ్‌ ప్రవేశాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సింగ్ ప్రవేశాలకూ నీట్‌ పరీక్ష నిర్వహించాలని అధికారులు సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని నర్సింగ్‌ కాలేజీలు కూడా నీట్‌ ఆధారిత ప్రవేశాలను సమర్ధించాయి. దీంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదం కోసం పంపగా.. సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో 2026-27 విద్యా సంవత్సరంలో నర్సింగ్‌లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు నీట్ యూజీ 2026 పరీక్ష రాయవల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే నీట్‌ యూజీ నోటిఫికేషన్‌ వెలువడగా.. ఫిబ్రవరి 8 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైనాయి. మార్చి 8, 2026వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నీట్‌ యూజీ 2026 పరీక్ష మే 3వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us