JEE Main 2025 Paper 2 Topper: జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2లో సత్తా చాటిన ఏపీ కుర్రోడు.. జాతీయ స్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌!

జనవరి 30వ తేదీన నిర్వహించిన జేఈఈ (మెయిన్‌) పేపర్‌ 2 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో పీడబ్ల్యూబీడీ కేటగిరీలో ఏపీకి చెందిన శ్రీసాయి హిమినేష్‌ 99.53 పర్సంటైల్ స్కోర్ చేసి ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచాడు. రోజుకు 12 గంటలకు పైగా పరీక్షకు ప్రిపరేషన్‌ సాగించానని, అందుకే ఈ ఫలితం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు..

JEE Main 2025 Paper 2 Topper: జేఈఈ మెయిన్‌ పేపర్‌ 2లో సత్తా చాటిన ఏపీ కుర్రోడు.. జాతీయ స్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌!
JEE Main 2025 Paper 2 Topper

Updated on: Feb 25, 2025 | 8:05 AM

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30వ తేదీన నిర్వహించిన జేఈఈ (మెయిన్‌) పేపర్‌ 2 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 22వ తేదీన తుది కీ విడుదల చేశారు. తాజాగా ఫలితాలు జారీ చేశారు. జేఈఈ మెయిన్‌ సెషన్ 1 పేపర్‌ 2 ఫలితాల్లో పీడబ్ల్యూబీడీ కేటగిరీ విజేత శ్రీసాయి హిమినేష్‌ 99.53 పర్సంటైల్ స్కోర్ చేసి టాపర్‌గా నిలిచాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన ఇమిడి శ్రీసాయి శ్రీసాయి హిమినేష్ ఆదివారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ బీఆర్క్, బిప్లానింగ్ పరీక్ష (పీడబ్ల్యుబీడీ) విభాగంలో జాతీయ టాపర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రోజుకు 12 గంటలకు పైగా పరీక్షకు ప్రిపరేషన్‌ సాగించానని, అందుకే ఈ ఫలితం వచ్చిందని హిమినేష్ అంటున్నాడు. జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హిమినేష్ మాట్లాడుతూ..

ఈ విజయం నాది మాత్రమే కాదు. ఇది మా నాన్నది కూడా. నాకు, నా తమ్ముడికి మంచి విద్యను అందించడానికి ఆయన చేసిన అవిశ్రాంత కృషి ఫలితం ఇది. నాన్నది చిరువ్యాపారం. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి నన్ను, తమ్ముడిని చదివించారు. ఇద్దరం చిన్నప్పటి నుంచే అన్ని క్లాస్‌లలో మొదటిస్థానంలో ఉన్నాం. నాన్న కష్టానికి ప్రతిఫలం ఈ గుర్తింపు. దేశంలోనే అత్యున్నత ఐఐటీలో చదవాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో నూతన ఆవిష్కరణలు చేయాలనేది నా కల’ అంటూ జేఈఈ మెయిన్‌ బీఆర్క్, బీ ప్లానింగ్‌ ఫలితాల్లో పీడబ్ల్యూబీడీ కేటగిరీలో జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన హిమినేష్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

హిమినేష్‌.. రాజమహేంద్రవరంలోని స్థానిక శ్రీషిర్డీసాయి విద్యాసంస్థల్లో చదువుతున్నాడు. హిమినేష్‌ తండ్రి రామచంద్రరావు. ఆయన చాక్లెట్ల హోల్‌సేల్‌ వ్యాపారి. తల్లి సురేఖ గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు హిమినేష్‌. హిమినేష్ దేశంలోని అత్యున్నత ఐఐటీలలో ఒకదానిలో చదవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆవిష్కరణలు చేయడమే తన దీర్ఘకాలిక ఆశయం అని తెలిపాడు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగానికి అర్థవంతమైన సహకారాలు అందించాలనే కోరికతో అడుగులు వేస్తున్న ఈ యువ కిరణం ఆశయం నెరవేరాలని ఆశిద్దాం..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.